రైతుల కోసమే మిషన్ కాకతీయను చేపట్టినట్లు, వ్యవసాయ రంగానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన స్టేట్ క్రెడిట్ సెమినార్ 2015-16 కు భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, ఈటెల ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సెమినార్ లో దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరును తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చుతూ వీరిద్దరూ లోగో విడుదల చేశారు. ఇకపై దక్కన్ గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా వాడుకలోకి రానుంది.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు బాగుంటాయని, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని తమ ప్రభుత్వం నమ్ముతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు తమ మొదటి ప్రాధాన్యం వ్యవసాయమేనని చెప్పారని ఈటెల గుర్తుచేశారు. గ్రీన్ హౌస్ కు 200 కోట్ల రూపాయలు కేటాయించడం సీఎం చిత్తశుద్ధిని చాటుతుందని, మొక్కుబడిగా రుణాలు ఇవ్వడం కాకుండా రైతులకు లాభం చేకూరేలా ఎలాంటి విధానాలు అవసరమో నిర్ణయించుకోవాలని ఈటెల సూచించారు.
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువులను పునరుద్ధరించాలని చూస్తున్నట్లు, దీనిద్వారా 265 టీఎంసీల నీటిని రైతులకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొత్తం చెరువుల్లో వచ్చే మే లోగా 9000 చెరువులు జలకళ సంతరించుకోనున్నాయన్నారు. రైతులకు అప్పు ఇచ్చినప్పటికీ వ్యవసాయానికి నీరు అందుబాటులో లేకుంటే కష్టమని, అందుకే నీటి సౌలభ్యం, మార్కెటింగ్ సదుపాయం మెరుగుపర్చుకునేందుకు బ్యాంకులు సహాయం చేయాలని హరీష్ కోరారు.