జనవరి 1 తర్వాత క్యాబ్ లకు మై వెహికల్ ఈజ్ సేఫ్ స్టిక్కర్ లేకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో ఒక యువతిపై యుబర్ క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై క్యాబ్ యజమానులు, డ్రైవర్లతో శుక్రవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, మహిళల నుండి ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
క్యాబ్ యజమానులు వాహనాల్లో జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేసుకుని తమ కార్యాలయాలనుండి డ్రైవర్లను కమాండింగ్ చేయాలని, డిసెంబర్ 31 లోగా క్యాబ్ లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశించారు. డిసెంబర్ 31 తర్వాత అంటే జనవరి 1 వ తేదీ నుండి కమిషనరేట్ పరిధిలో మై వెహికల్ ఈజ్ సేఫ్ స్టిక్కర్ లేకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామని కమిషనర్ చెప్పారు. డ్రైవర్ల నియామకాల విషయంలో యాజమాన్యాలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, నియామక సమయంలో డ్రైవర్లకు సంబంధించి పూర్తి వివరాలు, గత చరిత్రను కూడా తెలుసుకోవాలని ఆనంద్ సూచించారు.