mt_logo

బీఆర్ఎస్ ఎంపీలు మైన్స్, మినరల్స్ బిల్లుకు మద్దతిచ్చారనడం అర్థరహితం: వినోద్ కుమార్

మైన్స్, మినరల్స్ 2015 బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపణలను ఖండిస్తూ.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మైన్స్, మినరల్స్ 2015 బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బిల్లును ఒకసారి భట్టి చదవాలి.. ఆ బిల్లును మొదట 2011లో మన్మోహన్ నేతృత్వంలో ప్రవేశపెట్టింది అని తెలిపారు.

యూపీఏలో స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు తెచ్చిన బిల్లునే బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారనడం అర్థరహితం. భట్టి బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.

రేవంత్, మోడీ కలిసి సింగరేణిని అమ్ముతారని ఎపుడో చెప్పారు.. అదే నిజం అవుతోంది. బీఆర్ఎస్, బీజేపీలు బిల్లుకు మద్దతు ఇవ్వడం కాదు.. కాంగ్రెస్సే ఆ బిల్లు తెచ్చింది అని అన్నారు

సెక్షన్ 17 ఏ కింద బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి రిజర్వ్ చేయొచ్చు. గతంలో సీఎం కేసీఆర్ సింగరేణిపై కేంద్రానికి రాసిన లేఖనే ఇపుడు రేవంత్ ప్రామాణికముగా తీసుకోవాలి. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తక్షణమే ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి సింగరేణిని బతికించాలి అని కోరారు.

వందేళ్లకు సరిపడా సింగరేణిలో బొగ్గు నిల్వలు ఉన్నాయి.. వాటిని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించాలి. సింగరేణిని చంపడానికే బీజేపీ ఎనిమిది ఎంపీలు గెలిచారా.. వెంటనే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి అని వినోద్ కుమార్ అడిగారు.

మోడీతో ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా సింగరేణి బ్లాక్‌ల వేలాన్ని వాయిదా వేశాం తప్ప సింగరేణికి కేటాయింపజేయలేకపోయాం.. వాయిస్ ఓటుతో మినరల్ బిల్లు పాస్ అయిందనే కనీస పరిజ్ఞానం కాంగ్రెస్‌కు లేకపోవడం దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు.