mt_logo

సింగరేణి బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి: జగదీష్ రెడ్డి

సింగరేణి బొగ్గు గనుల వేలం వ్యవహారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే రక్షణ కవచం అని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను ఇతరులకు ధారాదత్తం చేస్తున్న ప్రతీసారి బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది అని అన్నారు.

కేఆర్ఎంబీ విషయంలోనూ ఇదే జరిగింది.. కేసీఆర్‌పై ఎదురుదాడే తప్ప కాంగ్రెస్ బీజేపీలకు తెలంగాణ సోయి లేదు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా పదేళ్లు కేసీఆర్ అడ్డుపడ్డారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో, బయట పోరాడిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచింది అని గుర్తు చేశారు.

గోదావరి, కావేరి అనుసంధానంపై కూడా కేసీఆర్ తిరగబడ్డారు. ఇప్పుడు సింగరేణి బ్లాక్‌ల వేలంపై కేటీఆర్ ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుంది. అయినా కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తూనే ఉంది అని తెలిపారు.

కేసీఆర్ తెలంగాణ హక్కులపై ఎపుడూ వైఖరి మార్చుకోలేదు.. భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాతే సింగరేణి బ్లాకులు ఆ సంస్థకే కేటాయించాలని భట్టి కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏం మారిందని భట్టి కిషన్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్, బీజేపీలు కూడబలుక్కుని డ్రామాలు ఆడుతున్నాయి . సింగరేణి కార్మికులు ఆ రెండు పార్టీలను అర్థం చేసుకోవాలి. సింగరేణి బ్లాకుల వేలంపై ఆ రెండు పార్టీల వైఖరి మారితే స్పష్టంగా చెప్పాలి అని అన్నారు.

దొంగ మాటలు వద్దు.. బొగ్గు గనుల వేలం పాట నుంచి శ్రావణపల్లి బ్లాక్ ఉంచారా తీసి వేశారా స్పష్టం చేయాలి.. శ్రావణపల్లి బ్లాక్‌ను వేలం నుంచి తీసేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. భట్టి నిన్న చెప్పిన దానికి ఈ రోజు చేస్తున్న దానికి పొంతన లేదు అని దుయ్యబట్టారు.

కిషన్ రెడ్డికి ఎన్ని పదవులు వచ్చినా తెలంగాణకు చేస్తున్నదేమీ లేదు. కిషన్ రెడ్డి దురదృష్టవంతుడు.. మొదటి నుంచి బీజేపీ తెలంగాణను నట్టేట ముంచే పని చేస్తోంది. మేక తోలు కప్పుకున్న పులుల్లా కాంగ్రెస్ బీజేపీలు వ్యవహరిస్తున్నాయి అని జగదీష్ రెడ్డి విమర్శించారు.

పోచారం ఇంటి దగ్గరకు వెళ్లిన మా బాల్క సుమన్ తదితరులను వెంటనే విడుదల చేయాలి.. పోచారం బీఆర్ఎస్ నేత కనుక ఆయన ఇంటికి మా నేతలు వెళ్లారు. ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారిని విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.

పోచారం బీఆర్ఎస్ పార్టీను వీడటం దురదృష్టకరం.. ఏమి ఆశించి పోచారం కాంగ్రెస్‌లోకి వెళ్లారో తెలియదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పోచారం కేసీఆర్ దగ్గరే ఉండి ధైర్యం చెప్పారు. పోచారంకు కేసీఆర్ ఏం తక్కువ చేశారు. స్వయంగా పోచారం ఎన్నో సార్లు కేసీఆర్ గొప్పతనాన్ని కొనియాడారు అని అన్నారు.

ఈ దేశంలో కేసీఆర్‌కు రాజకీయ పార్టీలతో పాటు మీడియాలో కూడా ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు. బీఆర్ఎస్‌కు ఇలాంటి ఒడిదొడుకులు కొత్త కాదు.. 2001 నుంచి ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం.. రాజకీయ పార్టీలకు ఎత్తు పల్లాలు సహజం. మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా కేసీఆర్ లేచి నిలబడతారు అని విశ్వాసం వ్యక్తం చేశారు.

శ్రావణపల్లి బ్లాక్ కూడా వేలం పాట లిస్ట్‌లో ఉంది.. మేము త్వరలోనే దీనిపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం. భట్టి బొకేలు ఇవ్వడానికే కిషన్ రెడ్డి దగ్గరకు వెళ్ళారా.. శ్రావణపల్లి బ్లాక్‌ను వేలం పాట జాబితా నుంచి భట్టి ఎందుకు తొలగించలేకపోయారు అని జగదీష్ రెడ్డి అడిగారు.

మీడియాలో ఓ వర్గం ప్రజలకు నిజనిజాలు తెలియకుండా కుట్ర పన్నుతోంది.. ఛత్తీస్‌ఘడ్‌తో విద్యుత్ ఒప్పందం వల్ల ఎవరో చెబితే ఆరు వేల కోట్ల రూపాయల నష్టం అని రాశారు. అది తప్పు అని మేమ వివరణ ఇస్తే దానికి మీడియా ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని విచారం వ్యక్తం చేశారు.

దేశంలో కాంగ్రెస్ బీజేపీలు శత్రువులు.. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి.. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ నిలబడుతుంది.. కేసీఆర్ నిలబడతారు అని స్పష్టం చేశారు.