mt_logo

విజయవాడలో 64 గంటలు…

By: టంకశాల అశోక్ 

మొత్తం ప్రభుత్వం ఇక్కడికి వచ్చి కూర్చోక, ఇక్కడి నుంచి పరిపాలించక, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించక, హైదరాబాద్‌లో పనేమిటి? అన్నది పలువురి నుంచి వినిపించిన ప్రశ్న. అక్కడ కూర్చుని అక్కడి రాజకీయాల్లో కూడా అనవసరంగా తలదూర్చుతున్నందుకే ఈ తరహా అనర్థాలు ఎదురవుతున్నాయని వారంటున్నారు. కొద్దిమంది మరికొంత ముందుకువెళ్లి, హైదరాబాద్‌లో వీళ్లకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నందునే అక్కడ రాజకీయాలు చేస్తున్నారని, స్వరాష్ట్రంలో పాలనను, ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

విజయవాడలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు 64 గంటలు గడిపి, ఓటుకు నోటు ఉదంతంపై పలువురితో మాట్లాడిన మీదట కలిగిన అభిప్రాయలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వీడియో టేపులు గాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆడియో టేపులు గాని నిజమైనవి కావని ఒక్కరంటే ఒక్కరైనా భావించడం లేదు. అవి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టించినవని ఎవరూ అనుమానించడం లేదు. చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేయడం నిజమే అనుకున్నా, తను ఆ విధంగా మాట్లాడారా లేదా అన్నదే అసలు ప్రశ్న అని అందరూ అంటున్నారు.

ఈ పరిణామాలన్నీ చంద్రబాబు స్వయంకృతం అని స్పష్టంగా అభిప్రాయపడుతున్న వారెవరికీ తెలంగాణ ప్రజలపై గాని, రాష్ట్రంపై గాని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గాని, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గాని వ్యతిరేక భావనలు ఎంత మాత్రం ఏర్పడలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబుతో సహా ప్రభుత్వమంతా ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చి పరిపాలనపైన, అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి తప్ప పొరుగు రాష్ట్రంలో ఇదంతా ఏమిటన్నది వారి ఏకాభిప్రాయం.
చంద్రబాబుకు ఏమన్నా అయితే, వ్యక్తిగతంగా తన పరిస్థితి ఏమిటని విచారిస్తున్న వారికన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భవితవ్యం అనిశ్చితికి గురవుతుందేమోనని ఆందోళనపడుతున్న వారు ఎక్కువ ఉన్నారు.

టేపుల ఉదంతం బయటపడిన 20రోజుల కాలంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు సాగిస్తున్న ఒక్కొక్క ఎదురుదాడి అక్కడి ప్రజలను నమ్మించకపోగా, వారిని తన చుట్టు సంఘటితం చేయకపోగా, ఆయనకే ఎదురు తిరుగుతున్నది. అవన్నీ నిర్హేతుకమైన ఆత్మరక్షణ చర్యలనే నమ్మకం ఏర్పడడంతో, ఎదురుదాడి చేసిన ప్రతిసారి చంద్రబాబు విశ్వసనీయత ఇంకొంత పడిపోతున్నది. ఆయనకు, ప్రజలకు మధ్య దూరం పెరుగుతున్నది.
నేనక్కడ మాట్లాడినవారిలో మధ్యతరగతి వారు, దిగువ మధ్య తరగతి వారు, పేదలు (నిరుపేదలు కాదు) ఉన్నారు.

ఉన్నత తరగతుల వారిని కలవలేదు. కలిసిన వారిలో వేర్వేరు వృత్తులు, వయసుల వారున్నారు. మహిళలు లేరు. వీరిలో అధికులు 2014లో టీడీపీకి ఓటు వేశారు. కానీ ఎవరికి ఏ పార్టీ పట్ల అనుబంధం, విధేయత లేవు. కొందరు లోగడ వామపక్షాలకు, లేదా కాంగ్రెస్‌కు అభిమానులుగా ఉండి ఇప్పు డు దూరం జరిగారు. ప్రస్తుతం, ఈటేపుల ఉదంతం తర్వాత, ఒకరి మాటల్లో చెప్పాలంటే, అసలు ఏ పార్టీకి ఓటేయాలన్నా భయమనిపిస్తున్నది.

రేవంత్ రెడ్డి వీడియోలు అంత స్పష్టంగా కన్పించినందున వాటిని నమ్మకపోయే ప్రసక్తి లేదని, ఆడియోల్లో చంద్రబాబు స్వరం తమకు బాగా తెలిసిందే గనుక అది సృష్టించినటువంటిదనే టీడీపీ వాదన వట్టిదని ప్రతి ఒక్కరి అభిప్రాయం. పైగా, అది తన స్వరం కాదని ఆయన ఇంతవరకు అనకపోవడాన్ని అందరూ ఎత్తి చూపుతున్నారు. ఇది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతిపక్షాల నుంచి వినవస్తున్న వ్యాఖ్య కాగా, విజయవాడలో సాధారణ ప్రజలు కూడా సరిగా అదే అభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది. రేవంత్‌ను కుట్ర పన్ని ఇరికించారనే వాదనను వారు ఈసడించినట్లు కొట్టివేస్తున్నారు. చంద్రబాబు కూడా ఇతర నాయకుల వలె ఈ తరహా బేరాలు చేసే మనిషేనని, తను పంపకుండా రేవంత్ ఎట్లా వెళతాడని, అటువంటప్పుడు కుట్ర, ఇరికించడం అనే మాటలేమిటని అపహాస్యం చేస్తున్నారు.

చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేయడం ప్రశ్నకు వస్తే, అసలు ట్యాపింగ్ జరిగిందా లేదా అనే సాంకేతిక ప్రశ్న గాని, అది చట్ట విరుద్ధమా కాదా అనే లీగల్ వాదనలు కాని, ఇంకా చెప్పాలంటే అది నైతికమా అన్న మీమాంసలు గాని విజయవాడ సామాన్య జనులకు ప్రశ్నలుగానే తోచడం లేదు. వారి సాధారణ దృష్టికి అది చంద్రబాబు స్వరమా కాదా అన్నదే నిజమైన ప్రశ్న. ఆయన తెలంగాణ ఎమ్మెల్యేతో బేరం గురించి మాట్లాడారా లేదా అనేదే నైతికత. వారికి ఈ ముక్కు సూటి వాస్తవం, సాధారణ నైతికతకు మించిన చట్టాలు, నైతికతలు ఆలోచనలకు తట్టేవికావు.

ఆ విధంగా చంద్రబాబు ఇప్పటికే వారి దృష్టిలో దోషి అయిపోయారు. ఆయన ఎదురు వాదనలు, ఎత్తుగడలు ఒక్కొక్కటి ముందుకు వచ్చిన కొద్దీ, అవన్నీ తప్పించుకునేందుకు మాత్రమేనని వారంటున్నారు. అసలు దోషంతో పాటు ఈ తప్పించుకునే వాదనల కారణంగా రోజులు గడిచిన కొద్దీ వారి దృష్టిలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోతున్నది. తన పట్ల విశ్వసనీయత, గౌరవం తగ్గుతున్నాయి. ప్రజల మానసిక స్థితి ఏ దశకు చేరిందంటే, ఒకవేళ ట్యాపింగ్ జరిగిందని మాటవరుసకు తేలినా అందువల్ల వారి అభిప్రాయం మారగల అవకాశం కన్పించడం లేదు. ట్యాపింగ్ అయితే మాత్రం ఏమిటి? ఆయన ఆ మాటలన్నాడా లేదా? అనే ప్రశ్న వారి నుంచి వినవచ్చేట్లుంది. పైన చెప్పినట్లు, ప్రజలకు సంబంధించి చంద్రబాబు దోషాన్ని నిర్ధారించేది తన మాటలు మాత్రమే. ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది కాదు.

చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు ఈ పరిణామాల కారణంగా అక్కడి ప్రజలకు తెలంగాణ ప్రజలపైకాదు గదా కేసీఆర్‌పై సైతం వ్యతిరేకత కన్పించడం లేదు. బాబు చేసిన తప్పు ఎదురుగా కన్పిస్తుండగా వాళ్లపైన వ్యతిరేకత ఎందుకన్నది విజయవాడ వాసుల ప్రశ్న. ఇటువంటి ప్రస్తావనే వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. చంద్రబాబు శిబిరం చేస్తున్న ఈ ప్రచారం, అందువల్ల ఆశిస్తున్న ప్రయోజనం వృథా ప్రయాస అన్నది అక్కడ అంతమందిని కదిలించిన మీదట స్పష్టమవుతున్న విషయం. పరిస్థితిని ఇతరత్రా చూసినప్పుడు అక్కడి వారికి విభజన సమయంలో ఉండిన వ్యతిరేకతలు ఈ ఏడాది కాలంలో సమసిపోయాయి. జరిగిందేదో జరిగిపోయింది.

ఇక ఎవరి రాష్ట్రాన్ని వాళ్లు పాలించుకోవడం, అభివృద్ధి చేసుకోవడం జరగాలి. ఎంతకాదన్నా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అందరం తెలుగువాళ్లమే కదా అన్నది అనేకుల నుంచి వినిపించే మాట. ఇటువంటి ఆలోచనలు చేస్తూ భవిష్యత్తు గురించి ఆశలు పెట్టుకున్నవారు, తగిన కారణమంటూ ఏదీ లేకుండా తెలంగాణపై తిరిగి వ్యతిరేకత తెచ్చుకుంటారనడం అర్థం లేనిది. పైగా చంద్రబాబు తన ప్రయోజనాల కోసం తప్పు చేసినప్పుడు, తెలంగాణ చేసిన తప్పేమిటో కనిపించనప్పుడు, తాము తెలంగాణపై కోపగించడమేమిటన్నది వారి మాటల్లో కనిపించిన సారాంశం.

ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఒకటున్నది. గత ఏడాది కాలంలో సామాన్య ప్రజలకు చంద్రబాబు పాలన పట్ల ప్రేమ కాదు గదా సదాభిప్రాయం కూడా కలగలేదు. ఇరువురి మధ్య దూరాలు ఏర్పడ్డాయి. ఒకవేళ ఆయన పాలన పట్ల ప్రేమలు కలిగి ఉంటే, ఓటుకు నోటు ఉదంతంలో తనది తప్పయినా ఒప్పయినా, ఆయనను సమర్థించకపోయినా కనీసం కొంత సానుభూతి చూపే వారేమో. కానీ అటువంటి ప్రేమ కలగనందున ఈ కేసులో సానుభూతి కూడా చూపకపోగా, ఆయన దోషి అనే భావనలు ఇంకా పదును తేరుతున్నాయి.

ప్రేమలేని తనపు ప్రభావం టేపుల కేసు విషయంలోనూ ఉన్నట్లు వారి మాటల అంతరార్థాలు చూపుతున్నాయి. కేసు విచారణ సందర్భంగా ఒకవేళ చంద్రబాబుకు ఏమైనా జరిగితే అన్న ఊహ కూడా వారికి తన పట్ల సానుభూతిని సృష్టించకపోవడానికి కారణం ఇదేననిపిస్తున్నది. తన కు ఏదైనా జరిగితే ఆ తర్వాత నాయకుడెవరు? మిగిలిన విషయాలు ఎట్లున్నా చంద్రబాబుకు సమర్థుడనే ప్రతిష్ట ఉన్నందున అటువంటి వారు మరొకరున్నారా? తెలుగుదేశంలో గాని, బయటగాని, అన్న దశలో ఆలోచనలు జరుగుతున్నాయి గాని అయ్యో, చంద్రబాబు అనడం అంతగా కన్పించడం లేదు.

విజయవాడ వాసులతో మాట్లాడినప్పుడు వారి ఆలోచనలలో తేలుతున్నది ఒకటున్నది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అనేక సమస్యలున్నాయి. ఆర్థికంగా ఉన్నాయి. భవిష్యత్తును నిర్మించుకోవడం పరంగా ఉన్నాయి. అందరూ పెద్దదిక్కుగా చూస్తుండిన విద్య-ఉపాధి కేంద్రం హైదరాబాద్ లేకుండా పోయింది. స్వంత రాజధాని నగరం లేదు. హైదరాబాద్‌తో పోల్చదగిన విద్య-ఉపాధి-అభివృద్ధి కేంద్రం తమకు లేదు. కేంద్రం నుంచి ఆశించినంత లభించడం లేదు. ఇది చాలా కీలక దశ. ఇటువంటి దశలో చేయవలసింది చేయకపోతే, శ్రమించి పని చేయనట్లయితే సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి.

ఇది స్వయంగా చంద్రబాబు కూడా అంటున్నదే. అటువంటి స్థితిలో మొత్తం ప్రభుత్వం ఇక్కడికి వచ్చి కూర్చోక, ఇక్కడి నుంచి పరిపాలించక, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించక, హైదరాబాద్‌లో పనేమిటి? అన్నది పలువురి నుంచి వినిపించిన ప్రశ్న. అక్కడ కూర్చుని అక్కడి రాజకీయాల్లో కూడా అనవసరంగా తలదూర్చుతున్నందుకే ఈ తరహా అనర్థాలు ఎదురవుతున్నాయని వారంటున్నారు. కొద్దిమంది మరికొంత ముందుకువెళ్లి, హైదరాబాద్‌లో వీళ్లకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నందునే అక్కడ రాజకీయాలు చేస్తున్నారని, స్వరాష్ట్రంలో పాలనను, ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనినంతా గమనించిన మీదట, చంద్రబాబు తన వివిధ చర్యల ద్వారా ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొట్టి ఆత్మరక్షణకు ఉపయోగించుకోవడం మాటేమో గాని, తనకు, తన ప్రజలకు మధ్య ఇప్పటికే ఏర్పడుతున్న దూరాన్ని మరింత పెంచుకుంటున్నట్టు మాత్రం కనిపిస్తున్నది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *