ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కేంద్ర ఉక్కుశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తెలంగాణలో ఖనిజాల వెలికితీతకు అవకాశాలున్న గనుల వివరాలతో కూడిన జియాలజీ, మినరల్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించి మొదటి ప్రతిని సీఎం కేసీఆర్ కు అందజేశారు. అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఉన్న గనుల ద్వారా అపారమైన ఖనిజ సంపదను వెలికితీయడం ద్వారా జరిగే అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బయ్యారం గనులలో ఐరన్ ఓర్ నిల్వలపై అధ్యయనాన్ని త్వరగా పూర్తిచేయాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) యూనిట్ ను వరంగల్ లో ప్రారంభించడానికి నరేంద్రసింగ్ తోమర్ అంగీకరించారు.
తెలంగాణలో ఉన్న గనులు, ఖనిజాల లభ్యత, బొగ్గు నిల్వలను వెలికితీసే విషయాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. ఈ అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో భేటీ కావాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద కుమార్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సీఎండీ మధుసూదన్, ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి తదితరులు పాల్గొన్నారు.