mt_logo

విజయమ్మను ఎలా స్వాగతించాలి?

By: కట్టా శేఖర్ రెడ్డి

నేతలకు ప్రజల మతిమరుపు మీద ప్రగాఢ విశ్వాసం. మొన్న జరిగిందేదీ ఇప్పుడు గుర్తుండదులే అన్న నమ్మకం కావచ్చు. ఏమూలైనా గుర్తున్నా కొత్త నినాదాలు, సరికొత్త ప్రచారాలతో దేనినయినా కమ్మేయవచ్చునన్న ధీమా కావచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు చేస్తున్న ప్రయత్నం ఈ ధీమాలో భాగమే. రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్ల పాలన గురించి ఇప్పుడు ఎవరికి గుర్తుంటుంది? ఆయన రైతులకు, చేనేత కార్మికులకు ఏం చేశారో ఏం చేయలేదో ఇప్పుడెవరిక్కావాలి? తెలంగాణ ఆకాంక్షలను ఆయన ఎలా వెక్కిరించారు, ఎలా ఎగతాళి చేశారు, ఎలా కాలరాశారు అన్నది అప్రస్తుతం? తెలంగాణ భూములను తేరగా పంచేసిన తెంపరితనం ఎవడికి కావాలి? అసెంబ్లీ నట్టనడుమ ఒక తెలంగాణవాది ముఖం మీద ‘నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు?’ అని ప్రశ్నించిన దురహంకారాన్ని ఎందుకు గుర్తుంచుకోవాలి? చరిత్ర ఎవడిక్కావాలి? చరిత్ర పుటల్లో చేరిపోయిన విధ్వంసం ఎవరికి కావాలి? నిన్నటి తప్పులను ఇవ్వాళ ఎందుకు మాట్లాడాలి? మొన్నటి గాయాలను ఇంకా ఎందుకు కెలుక్కోవాలి? అవకాశవాదం, రాజకీయ బానిసత్వం రంగరించిన నాయకత్వతరానికి ఇవి అవసరం లేకపోవచ్చు. కానీ తెలంగాణవాదులను ఇవి వెంటాడుతున్నాయి. పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. ‘ఎన్నిసార్లు మోసపోతావు వెర్రివాడా?’ అని ప్రశ్నిస్తున్నాయి. జరిగింది చాలు, ఇక హద్దులు గీయాలని ఎగదోస్తున్నాయి. మనుషుల్ని, మనసుల్ని గుర్తించే తెలివి తెచ్చుకోమని బోధిస్తున్నాయి.

సాధారణంగా అయితే తెలంగాణలో ఎవరయినా పర్యటించడానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండనక్కరలేదు. ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడయినా తిరిగి తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. కానీ తెలంగాణ పరిస్థితికి ఒక నేపథ్యం ఉంది. పదకొండేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమం జరుగుతోంది. అవసరమయినప్పుడు రాజశేఖర్‌రెడ్డి కూడా ఈ ఉద్యమంతోనే కలసి ప్రయాణించాడు. అవసరం తీరిపోగానే తెలంగాణ ఉద్యమాన్ని ఆగంపట్టించడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఉద్యమం గెలిపించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. పార్టీని చీల్చడానికి ప్రయత్నించాడు. తెలంగాణవాదం లేదని, రాదని చెప్పడానికి ఆయన తపించిపోయాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యోచనను కేంద్రం బుర్రలోకి రాకుండా చివరిక్షణం వరకు అడ్డుపడిన నాయకుడు వైఎస్సారే. ఎంతో దూరం ఎందుకు, 2009 ఎన్నికల సమయంలో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియగానే నంద్యాలకు వెళ్లి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. ‘మహాకూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో మనం విదేశీయులుగా బతకాల్సివస్తుంది. టి.ఆర్.ఎస్. మద్దతుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే పోతిరెడ్డి పాడును మూసేస్తారు. కేసీఆర్ చేతిలో చంద్రబాబు కీలుబొమ్మలా మారి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు…కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణేతర విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను మూయించేస్తామన్నారు…పరిస్థితులు ఎటు దారితీస్తాయో గమనించండి’ అని వైఎస్ రాజశేఖర్‌డ్డి 2009 ఏప్రిల్ 16న నంద్యాల ఎన్నికల సభలో సీమాంధ్ర ప్రజలను హెచ్చరించారు. ‘కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు విజయం సాధిస్తే ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ఎలా కాపాడగలరు? పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులను వ్యతిరేకించబోమని కేసీఆర్‌తో చెప్పించాలి. తెలంగాణలో అడుగుపెట్టాలంటే వీసా ఉండాలనే విధంగా కేసీఆర్ ధోరణి ఉన్నది’ అని అదే రాజన్న 2009 ఏప్రిల్ 16 గుంటూరు, చిలుకలూరిపేట సభల్లో మరోసారి సీమాంధ్ర ప్రజలను బెదిరించారు. తెలంగాణ రాష్ట్రానికి తాను పచ్చి వ్యతిరేకినని పదేపదే రుజువు చేసుకున్నారు. ఇప్పుడు జగనన్న ఆయన(రాజన్న) రాజ్యం తెస్తానని చెబుతున్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడమే కాదు, పార్లమెంటులో ఆచరించి చూపించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించగానే, పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీల చేతుల్లోని ప్లకార్డులను లాక్కుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ‘టీడీపీ సభ్యులు ముందస్తు పథకం ప్రకారం తెలంగాణ ప్రాంతంవారు లేకుండా చూసి జీరో అవర్‌లో సమైక్యాంధ్ర అంశాన్ని లేవనెత్తారు. అప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ లేకపోవడంతో వారొక్కరే సమైక్యవాదాన్ని వినిపించే ఛాంపియన్‌లలా వ్యవహరించారు. వారికి ఆ లబ్ధి చేకూరకూడదనే నేను వారికి మద్దతుగా వెళ్లాను. తెలంగాణ ఎంపీలు ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా నినాదాలిస్తుంటే కాంగ్రెస్ నుంచి సమైక్యవాదాన్ని వినిపించడానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ఎంపీలు అక్కడ లేకపోవడంతో నాకు వేరే మార్గం లేకపోయింది’ అని జగన్ ఆ తర్వాత పార్లమెంటు బయట స్పష్టంగానే వివరించారు.

వైఎస్సార్‌కు, జగన్‌కు తెలంగాణ విషయంలో స్పష్టత ఉన్నది. సమైక్యాంధ్రకోసం వారు ఏమేమి చేయాలో అవన్నీ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు కూడా స్పష్టత వచ్చింది. గత రెండున్నరేళ్లలో వచ్చిన అన్ని ఉపఎన్నికల్లోనూ ప్రజలు ఆ స్పష్టతను ప్రదర్శించారు. పాలను నీళ్లను వేరు చేసి చూపిస్తున్నారు. ఎటొచ్చీ స్పష్టత లేనిది తెలంగాణ రాజకీయ బానిస నాయకత్వాల్లోనే. తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి తన్నుకుపోవడం ఇక్కడి ప్రజలను కనీవినీ ఎరుగని దగాకు, క్షోభకు గురిచేసింది. ఈ క్షోభను తట్టుకోలేని వారు మంటల్లో కాలిపోయి, రైలుకింద తలలు పెట్టి, ఉరివేసుకుని, పురుగుల మందు తాగి సుమారు 900 మంది యువకులు బలిదానాలు చేశారు. ఇప్పుడు విజయమ్మకు స్వాగతం పలకాలంటే ఈ రెండున్నరేళ్ల చరిత్రను పాతర వేయాలి. ఇన్ని వందల కుటుంబాల గుండె ఘోషను మరచిపోవాలి. ఇన్ని ద్రోహాలను, మోసాలను, విషాదాలను మొసలి కన్నీళ్ల కింద దాచేయాలి. తెలంగాణలో ఏమీ జరగనట్టే జగనన్నకు, విజయమ్మకు స్వాగతం పలకాలి.

పోనీ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు, చేనేత కార్మికులు సుభిక్షంగా ఉన్నారా? అసలు ఆత్మహత్యలే జరగలేదా? ‘మేము అధికారంలోకి వస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూస్తాను’ అని రాజశేఖర్‌రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మాసాల వరకు హడావిడి చేశారు. కానీ ఆ తర్వాత ఏమైంది? ఆయన అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో రాష్ట్రంలో సుమారు పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ‘ఒక్క 2009 సంవత్సరంలోనే 2414 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు సంవత్సరం 2105 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధిక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది రెండవస్థానం…గత ఆరేళ్లలో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగిన సంవత్సరం ఇదే’-జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ఆధారంగా ప్రఖ్యాత జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ రాసిన వ్యాసంలోని వివరాలివి.

చేనేత కార్మికుల ఆత్మహత్యలూ ఆగలేదు. రాజన్న ఐదేళ్ల పాలనలో 223 మంది చేనేత కార్మికులు, 20పందు మంది మరమగ్గాల కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వారిలో సగంమందికి ఎటువంటి సహాయమూ అందలేదు. వారి అప్పులను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలూ నెరవేరలేదు. ఒక్క రైతూ చావగూడదన్న రాజన్న ఆ తర్వాత ఆ విషయమూ ఎక్కడా ప్రస్తావనకు రాకుండా చూసుకున్నారు. సంఖ్యలు అబద్ధాలు చెప్పవు. ఇవన్నీ ప్రభుత్వ నివేదికలలో ఉన్నవే. ఈ ఆత్మహత్యలు ఎవరి పాపం? ఇంత మంది రైతులు, చేనేత కార్మికులు ఉరితాళ్లను, పురుగుల మందు డబ్బాలను ఎందుకు ఆశ్రయించారు? అయినా అవన్నీ మరచిపోవాలి. అసలేమీ జరగనట్టే, తమకేమీ సంబంధంలేనట్టే జగన్, విజయమ్మ మాట్లాడతారు. మనం వినిపించుకోవాలి. ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు. వారికి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలకాలి.రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టులేమయినా పూర్తి చేశారా? అదీ లేదు. మొదలు పెట్టడానికి చాలా మొదలు పెట్టారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎల్లంపల్లి .. ఒక్కటి పూర్తయిందా? ఏ ప్రాజెక్టుకింద ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చాయి? కొత్తగా ఎన్ని టీఎమ్సీల నీరు తెలంగాణ భూములను తడిపింది? అలీ, గుత్ప ఎత్తిపోతల పథకాలు పూర్తి చేశామన్నారు. కానీ అవి రెండూ ఎత్తి పోతల పథకాలు. ఒక్కసారి మాత్రం నీరిచ్చారు. వాటి ద్వారా మహా అయితే తీసుకోగలిగిన నీరు ఐదు టీఎమ్సీలు. సాగయ్యే భూమి గరిష్ఠంగా 50 వేల ఎకరాలు. దేవాదులలో ఎత్తిపోయడం, పైపులు పగలడం, ప్రమాదాలు జరగడం మినహా సాగు వ్యవహారాలు ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. ఎల్లంపల్లి పూర్తి కావచ్చింది. కానీ కాలువలు లేవు. శ్రీరాంసాగర్ రెండోదశ కాలువలు పాముల్లా వరంగల్, నల్లగొండ జిల్లా అంతటా పరుచుకున్నాయి. కానీ వాటిల్లో నీళ్లు లేవు. మిగిలిన ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో, ఎప్పటికి నీళ్లిస్తాయో తెలియదు. అసలు పూర్తవుతాయో లేదో కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే ఇందులో చాలా ప్రాజెక్టులు లిఫ్టులు. చాలా కరెంటు కావాలి. బోరుబావులకే కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. లిఫ్టులకు ఎలా ఇచ్చేది? తెలంగాణకు టీఎమ్సీల లెక్క తేలడం లేదు కదూ! తేలవు. కానీ రాజన్న ఏం చేశాడో తెలుసా? 11500 క్యూసెక్కుల ప్రవాహంతో రోజుకు ఒక్క టీఎమ్సీ చొప్పున 45 రోజులపాటు- అంటే 45 టీఎమ్సీల(వరద రోజుల) నీటిని తరలించుకుపోవడానికి అవకాశం ఉన్న పోతిరెడ్డి పాడు కాలువను, రాజన్న ఏకంగా 55000 క్యూసెక్కులకు పెంచారు. పోతిడ్డిపాడు 11500 క్యూసెక్కుల స్థాయిలో ఉన్నప్పుడు కాలువ, ఇప్పుడది ఒక చిన్న నది. కాలువను నదిగా మార్చే పని ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడు పూర్తి చేశారు? 2005 చివరలో మొదలు పెట్టారు. 2009లో పూర్తయింది. పూర్తయిన తర్వాత పాత తూములు మూసేసి, కొత్త తూములు మాత్రమే వాడతామన్నారు. కానీ అన్ని తూముల ద్వారా 55000 క్యూసెక్కుల ప్రవాహంతో రోజుకు సుమారు ఐదు టీఎమ్సీల చొప్పున 45 రోజుల్లో(వరద రోజులు) 225 టీఎమ్సీలు నీటిని తీసుకు పోవచ్చు. ఎటొచ్చీ శ్రీశైలంలో 854 అడుగుల మట్టానికి పైన నీళ్లు ఉండాలి, అక్కడ నింపుకునేందుకు రిజర్వాయర్లు ఉండాలి. పోతిరెడ్డిపాడు కాలువ మూడుగా చీలి తెలుగు గంగ, శ్రీశైలం కుడి కాలువ, కేసీ కెనాల్‌ల ద్వారా వెలిగొండ(17టీఎమ్సీలు), అలగనూరు, గోరుకల్లు(12.4), అవుకు(2), బ్రహ్మంసాగర్(17), చెన్నముక్కపల్లి రిజర్వాయరు, మైలవరం(4), గండికోట(11.9), సోమశిల(73), కండలేరు(6పందు) వంటి రిజర్వాయర్లు నింపుకుంటూ ముందుకు సాగుతుంది. ఇందులో చాలా రిజర్వాయర్లు పెన్నా నదిమీద నిర్మించినవి. కృష్ణా పరివాహకప్రాన్తంలోకి రావు. కానీ గత మూడేళ్లుగా పోతిరెడ్డిపాడు సీమాంధ్రలో పంటలు పండిస్తున్నది. కరువుసీమ రాయలసీమకు నీళ్లు తీసుకుపోవడాన్ని కూడా సమర్థించుకోవచ్చు. కానీ ఆగమేఘాలమీద పోతిరెడ్డిపాడును పూర్తి చేసి ఇన్ని టీఎమ్సీల నీటిని తరలించుకుపోయిన రాజన్న తెలంగాణ గొంతు ఎందుకు తడుపలేదు? ఎందుకంటే రాజన్న తెలంగాణ తనది అనుకోలేదు. తెలంగాణ ప్రజలను తన ప్రజలనుకోలేదు. తెలంగాణను ఆదుకోవాలనుకోలేదు. తెలంగాణ ఎప్పటికయినా తనకు కాకుండాపోతుందని తెలుసు. ఈలోగా తన ప్రాంతానికి ఏం చేసుకోవాలో తెలిసిన నాయకుడు ఆయన. ఎటొచ్చీ ఏ సోయీ లేని రాజకీయ నాయకత్వం మనవాళ్లే! అయినా రాజన్న రాజ్యం తెస్తానంటున్న జగనన్నకు, విజయమ్మకు సిరిసిల్లలో ఘనంగా స్వాగతం పలుకాల్సిందే!

గతంలో జగన్ అయినా, ఆ మధ్య చంద్రబాబు అయినా, ఇప్పుడు విజయమ్మ అయినా తెలంగాణకు ఎందుకు వస్తున్నారో మీరు దాచవచ్చు, కానీ ప్రజలకు తెలుసు-చేనేతలపై ప్రేమ కాదు, రాజకీయ ప్రవేశం కోసం తపన అని. రైతులపై ఆరాటం కాదు, రాజకీయ ప్రాపకం కోసం పాకులాట అని. చేనేతల పేరుతోనో, రైతుల పేరుతోనో, ఓదార్పు పేరుతోనో….పేరు ఏదయినా కావచ్చు కానీ లక్ష్యం ఇక్కడ రాజకీయ పునాదులు నిర్మించుకోవడమే. తప్పు లేదు. ఎవరయినా ఇక్కడ రాజకీయంగా బలపడవచ్చు. ఎంతమంది నాయకులయినా ఎదగవచ్చు. కానీ ఈ ఐదున్నర దశాబ్దాల గోసకు సమాధానం చెప్పకుండా, పుష్కరకాలపు తపనకు ఓదార్పునివ్వకుండా, ఈ రెండున్నరేళ్ల క్షోభకు ఊరటనివ్వకుండా… అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించకుండా ఇక్కడ రాజకీయం ఎలా చేస్తారన్నదే ప్రశ్న.

నేతలారా! మీరు ఏ పార్టీలోనయినా ఉండండి. ఏ పదవులయినా పొందండి. ఏ శిఖరాలయినా అధిరోహించండి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజ ప్రత్యేక రాష్ట్ర చౌరస్తాలో నిలబడి ఉంది. ఈ ప్రజలకు ఏం చెబుతారో చెప్పండి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తారో లేదో తేల్చండి. ‘మేం తెలంగాణకు వ్యతిరేకంకాదు’, ‘తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తాం’, ‘మేం ఇచ్చేవాళ్లం కాదు, తెచ్చేవాళ్లం కాదు’……చాలు ఇటువంటి మాయమాటలు, రెండు కళ్లు, నాలుగు నాలుకల నయవంచనలు చాలా చూశాం. విన్నాం. జగనన్నే పార్లమెంటులో ఏం చేశాడో, బయట ఏం మాట్లాడాడో, పార్టీ ఏర్పాటు చేసినంక ఏ తీర్మానం చేశాడో మీకు తెలుసు. ఎన్ని వంకరలు పోయారో చూశాం. ఇక ఇప్పుడు ముసుగులో గుద్దులాటలు వద్దు. మీరు వ్యతిరేకంగా తీర్మానం చేసినా సరే, ఒక రాజకీయ పార్టీగా మీ వైఖరేమిటో తేల్చండి.

‘సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాం’ అని బాహాటంగా ప్రకటించిన సిపిఎం కూడా తెలంగాణలో స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకుంటున్నది. మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసింది. దమ్ముంటే ఆ మాట చెప్పి సిరిసిల్లకు రండి. ఏం చేయాలో సిరిసిల్ల ప్రజలు నిర్ణయించుకుంటారు. లేదంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నాం అని ప్రకటించండి…సిరిసిల్ల మీకు స్వాగతం పలుకుతుంది. కానీ గతం నాస్తి, మొన్న ఏమీ జరగలేదు, నిన్న ఏమీ జరుగలేదు, అసలు తెలంగాణ సంగతే తెలియదన్నట్టు నటిస్తూ ఉంటే చూస్తూ ఎలా సహించడం! మోసం చేశాం… చేస్తాం…చేస్తూ పోతాం…మోసపోతూ ఉండండి అని మా తలరాతలు రాసే ప్రయత్నం చేస్తే మాత్రం పర్యవసానాలు కచ్చితంగా సవ్యంగా ఉండవు. రాజకీయ దోబూచులాటలను తెలంగాణ ప్రజలు ఇంకా జీర్ణించుకునే స్థితిలో లేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *