mt_logo

వృద్ధ సింహం-బంగారు కంకణం

By: కట్టా శేఖర్ రెడ్డి

వెనుకట అడవిలో ఒక సింహం ఉండేది. వయసు, శక్తి, దూకుడు ఉన్నకాలంలో ఆ సింహం అడవిలో స్వైరవిహారం చేసింది. తన పర భేదం లేకుండా అవసరాన్ని బట్టి అందరినీ మింగేస్తూ వచ్చింది. తనకు సన్నిహితంగా ఉండి సలహాలు, సూచనలు, చాడీలు చెప్పినవారిని సైతం కబళించేది. తను పరుగెత్తగలిగిన కాలంలో తాను ఏం చేసినా నడిచింది. వయసైపోయింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. శక్తి చాలడం లేదు. కదలలేకపోతోంది. మరి పొట్ట గడిచేదెలా? జీవనం సాగేదెలా? ఏదో ఒక జంతువును, ఎవరో ఒక మనిషిని తన వద్దకు రప్పించుకుని దగ్గరకు రాగానే పంజా విసరాలి. ఎవరో ఒకరు ఊరకే ఎందుకు దగ్గరకు వస్తారు? తాను మారిపోయానని నమ్మించాలి. శాకాహారిగా మారానని విశ్వాసం కలిగించాలి. తాను ఎవరికీ హాని చేయబోనని, అందరినీ బాగా చూసుకుంటానని హామీలు కురిపించాలి. అంతేకాదు ఒక బంగారు కంకణం సంపాదించి, దారిన పోయేవారికి చూపించి, దగ్గరకు వస్తే ఇస్తానని భ్రమపెట్టాలి. దగ్గరకు వచ్చిన తర్వాత తననుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆ వృద్ధసింహం ధీమా. కానీ ఎవరు నమ్ముతారు? సింహం శాకాహారిగా మారిందంటే ఎందుకు మోసపోతారు? ఇది పంచతంత్ర కథ! ఎప్పుడో రాసిన కథ! కానీ ఇందులోని నీతి ఇప్పటి రాజకీయాలకూవర్తిస్తుంది.

తాను మారానని చంద్రబాబునాయుడు చెబుతుంటే ఎవరూ నమ్మడం లేదు. ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా ఉద్యోగుల్లో సానుభూతి పెగలడం లేదు. అందరినీ బాగా చూసుకుంటానంటే చాలా మంది ఇంకా విశ్వసించడం లేదు. చంద్రబాబునాయుడు చేసే ప్రతి విమర్శ తిరిగి తిరిగి వచ్చి ఆయనకే తగులుతున్నది. ఆయన ప్రయోగించే బాణాలు బూమరాంగై ఆయననే గాయపర్చుతున్నాయి. ‘నువ్వు వెన్నుపోటుదారువి’ అని కొడాలి నానిని విమర్శిస్తే, ‘నిన్ను మించిన వెన్నుపోటుదారునా? ఎన్‌టిఆర్‌కు నువ్వు చేసిన అన్యాయం మరిచిపోయావా? నేషనల్ ఫ్రంట్‌కు వెన్నుపోటు పొడిచి బిజెపి పంచన చేరావు. టీ.ఆర్.ఎస్, కమ్యూనిస్టులు…అందరినీ వెన్నుపోటు పొడిచావు. నువ్వు ద్రోహం చేయనిదెవరికి?’ అని ఎదురుదాడి చేశారు. ‘ప్యాకేజీ రాజకీయాలు వచ్చాయి. ఎమ్మెల్యేలను కొంటున్నారు’ అని చంద్రబాబు ఆరోపిస్తే, ‘ఏ ప్యాకేజీ ఇచ్చి ఎన్‌టిఆర్‌కు వ్యతిరేకంగా దగ్గుబాటిని బుట్టలో వేశావు? ఏ ప్యాకేజీ ఇచ్చి ఎమ్మెల్యేలను వైస్రాయ్‌కి రప్పించావు? ఏ ప్యాకేజీ ఇచ్చి ఇతర పార్టీల వారిని నీ పార్టీలో చేర్చుకున్నావు?’ అని మరో గొంతు ప్రశ్నిస్తున్నది. ‘బీసీలకు వంద సీట్లు ఇస్తాను. పదివేల కోట్లు వారి సంక్షేమానికి కేటాయిస్తాను’ అని చంద్రబాబు అంటే, ‘గత ఎన్నికలకు ముందుకూడా ఇలాగే చెప్పారు-కానీ కేవలం 56 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు?’ మరొకాయన ప్రశ్నించారు. ‘జగన్ అవినీతి సామ్రాట్టు. గజదొంగ…..’ అని చంద్రబాబునాయుడు మిన్నూ మన్నూ ఏకం చేసినా, ‘అవినీతి పరులు కానిదెవరు? నువ్వేం తక్కువ తిన్నావా? నీ సంగతి ఎవరికి తెలియదు’ అని జనం గొణుక్కోవడమే కాదు, ఓటుతో కొట్టి మరీ చెప్పారు. ఉచిత విద్యుత్తు అడిగితే, ‘తప్పు తప్పు’ అని ప్రచారం చేసిన చంద్రబాబు, నగదు బదిలీ ఇస్తామంటే కూడా గెలిపించలేదు. ఎందుకిలా జరుగుతోంది? చంద్రబాబునాయుడు ఏం మాట్లాడినా ఎందుకు సానుకూలత రావడం లేదు? ఎందుకు ఆయన విశ్వసనీయత పెరగడం లేదు? లోపం ఎక్కడ ఉంది?

నమ్మకమయినా అపనమ్మకమయినా ఒక్కసారి పెరగదు. ఒక్కసారే తరగదు. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు, చెర్నాకోలా విసరగలిగినప్పుడు మనం జనంతో, వివిధ వర్గాలతో ఎలా వ్యవహరించామన్నదే నమ్మ కం పెరగడానికయినా, తరగడానికయినా కారణం.

చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల అధికారంలో ఎలా వ్యవహరించారో చాలా మందికి ఇప్పటికీ గుర్తుంది. గుర్తు చేసే నాయకులు ఉన్నారు. ప్రచార, ప్రసార సాధనాలు ఉన్నాయి. ఒకప్పుడంటే ఒకటే దృశ్యం. ఒకటే అక్షరం. ఆ దృశ్యం, అక్షరం రెండూ చంద్రబాబు ఆయుధాలే. ఇప్పుడు భిన్నభావాల దృశ్యాలు, అక్షరాలు పరస్పరం సంఘర్షిస్తున్నాయి. ఒకరి గుట్టును మరొకరు పట్టి పల్లార్చుతున్నారు. చంద్రబాబునాయుడు గత రెండు దశాబ్దాలుగా అపనమ్మకాన్ని టన్నుల కొద్దీ పెంచుకుంటున్నారే తప్ప తగ్గించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎన్‌టిఆర్‌కు చేసిన అన్యాయాన్ని అతిబలవంతంగా కప్పిపెట్టవచ్చు. అసలది చరిత్రలోకి ఎక్కకుండా దాచిపెట్టవచ్చు. కానీ ఎన్‌టిఆర్ అకాల మరణంతో నొచ్చుకున్న లక్షలాది మంది తెలుగు ప్రజలు ఇప్పటికీ చంద్రబాబును నమ్మడం లేదు. క్షమించడం లేదు.

ఆ గాయాలు అలాగే ఉన్నాయి. అందుకు, 2004లో ఆయనను శిక్షించారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోవడం, టీ.ఆర్.ఎస్, వామపక్షాలతో జట్టుకట్టడం వల్ల 2009 ఎన్నికల్లో ఆయనపై కాస్తంత నమ్మకం పెరిగింది. 92 స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. కానీ పెరిగిన ఆ కాస్త నమ్మకాన్నీ ఆయన కాపాడుకోలేదు. పైగా ఆయన కొత్త తప్పులు చేస్తూ పోయారు. ఎన్నికల్లోనే టీ.ఆర్.ఎస్.ను, వామపక్షాలను దెబ్బతీశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన రాగానే, ‘చట్….అలా ఎలా చేస్తారని’ అడ్డం తిరిగారు. ఇక ఆయనపై నమ్మకం పెరిగేది ఎలా?

నాయకునిగా రుజువు చేసుకోవాల్సిన ప్రతిసందర్భంలో, రాజనీతిజ్ఞత ప్రదర్శించాల్సిన ప్రతిమలుపులో పిల్లిమొగ్గలు వేస్తూ పోయారు. అలా టన్నుకు టన్ను….అనేక టన్నుల అపనమ్మకాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన అసలు సమస్యను వదిలేసి మిగతా సమస్యలన్నీ మాట్లాడుతున్నారు. చర్చలు, తీర్మానాలు, డిక్లరేషన్లు చేస్తున్నారు. అవన్నీ చేయాల్సిందే. కానీ వాటన్నింటికీ విలువ ఎప్పుడు వస్తుందంటే, మౌలికమైన అంశంపై నాయకుడు తన నిజాయితీని చాటుకున్నప్పుడు! చంద్రబాబు ఎంతమంచి నిర్ణయాలు చేసినా, తెలంగాణపై పోగేసుకున్న అపనమ్మకం వాటన్నింటినీ కమ్మేస్తుంది. తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబునాయుడు ఇవ్వాళ ఇంటికో తులం బంగారం ఇస్తామంటే, తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం వేయరు. చంద్రబాబును నమ్మరు. నాయకుడు కేంద్రంగా(లీడర్ సెంట్రిక్) మనుగడ సాగించే పార్టీల్లో బలమైనా, బలహీనతైనా నాయకుడే. నాయకుడు గట్టోడయితే పార్టీ గట్టిగా ఉంటుంది. నాయకుడు బలహీనపడితే పార్టీ బలహీనపడుతుంది.

మొన్నటి ఉప ఎన్నికల్లో చంద్రబాబునాయుడు శ్రీకాకుళంలో ప్రసంగిస్తూ ఉంటే చూశాను. చంద్రబాబు అత్యంత ఉచ్ఛస్వరంతో జగన్ ను, ఈ ప్రభుత్వాన్ని ‘సిగ్గుందా? శరముందా?’ అని ప్రశ్నిస్తుంటే సభకు హాజరైనవాళ్ల ముఖాలు చూశాను. అంతటి నాయకుడు, అంత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే జనంలో ఎంతటి అలజడి ఉండాలి? కానీ ఒక్కడు చప్పట్లు కొట్టినవాడు లేడు. నినాదాలు చేసినవాడు లేడు. కనీసం ముఖాల్లో ఏ ఫీలింగూ లేదు. అదే రాజకీయాల్లో కొత్తగా ఓనమాలు నేర్చుకుంటున్న షర్మి ళ మాట్లాడుతుంటే, నిరంతర జయజయధ్వానాలు! కొత్తొక వింత అని ఎవరయినా అనవచ్చు.

కొత్తగా కనిపించకపోతే, కొత్త నినాదాలు, కొత్త మాటలు చెప్పకపోతే జనం నాయకులను ఎందుకు పట్టించుకుంటారు? చంద్రబాబు కూడా కొత్తగా కనిపించాలి. రాజశేఖర్‌డ్డి పాదయాత్ర చేసి ఒక కొత్త అవతారంలో జనానికి చేరువయ్యారు. చంద్రబాబు కూడా పాదయాత్ర చేయాలని కాదు. మరో మార్గం! మరో ప్రయత్నం! చంద్రబాబు కూడా ప్రజల్లో నమ్మకాన్ని పాదుకొల్పే ఏదో కొత్త విషయం చెప్పకపోతే ఎందుకు వింటారు? చెప్పిన విషయాలే పదేపదే చెబు తూ ఉంటే జనంలో స్పందన ఎలా వస్తుంది? జనం నాయకుడిని పట్టించుకోవడం లేదంటే, ఆ పార్టీ పని అయిపోతున్నట్టే లెక్క. ఉపఎన్నికల ఫలితాలన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయంటే నాయకుడి మంత్రం పనిచేయడం లేదని సంకేతం! అటువంటి సంకేతం పదేపదే వస్తే నాయకుడు బలహీనపడిపోతారు. నాయకుడు బలహీనపడే కొద్దీ నిన్నమొన్నటిదాకా జయజయధ్వానాలు కొట్టినవాళ్లే ఎదురుతిరగడం మొదలుపెడతారు.

గెలిచే పార్టీల వైపు దూకడం మొదలవుతుంది. లీడర్లు, కేడర్లు జారిపోతుంటారు. ఈ పరిణామాలను ఆపాలంటే, ఈ పతనాన్ని అధిగమించాలంటే మళ్లీ పూనుకోవలసింది నాయకుడే. తెలుగుదేశం బతకాలంటే తెలంగాణకైనా, ఆంధ్ర ప్రాంతానికయినా గట్స్ ఉన్న ఒక నాయకు డు కావాలి. ఆయా ప్రాంతాల ప్రజలకు నమ్మకం కలిగించగల ధీరుడు కావాలి. స్పష్టత, నిజాయితీ కలిగి ఉండడమే కాదు మాటమీద నిలబడే మొనగాడు కావాలి. కుట్రలు, కుతంవూతాలు, ఎత్తులు జిత్తులపై ఆధారపడకుండా, జనం చేత అందరివాడు అనిపించుకునే ప్రయత్నం జరగాలి. అంతా బాగుంది(ఆల్ ఈజ్ వెల్) అని మీడియా ఇచ్చే బిల్డప్‌లు, కవరప్‌లు పెయిన్ కిల్లర్స్ లాంటివి. అవి తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తాయి. వాటితో పూర్తిగా కోలుకోవడం సాధ్యం కాదు. తెలుగుదేశానికి ఇప్పుడు కావాల్సింది యాంటీ బయాటిక్స్. మూలాల్లోంచి చికిత్స జరగాలి. చంద్రబాబునాయుడే అందుకు పూనుకోవాలి. పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే షార్ట్‌కట్‌లు ఉండవు. కఠిన నిర్ణయాలు, కఠోర శ్రమ అనివార్యం. [నమస్తే తెలంగాణ నుండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *