mt_logo

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం కర్ణాటక గిరిజనుల డబ్బు?.. కొత్త స్కాం బట్టబయలు

కర్ణాటకలో తీగ లాగితే.. తెలంగాణలో డొంక కదిలింది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని గత కొన్ని రోజుల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీట్‌లో నిర్ధారించింది. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

సదరు మాజీ మంత్రి పీఏ విజయ్ కుమార్ గౌడ మొబైల్ ఫోన్ నుండి సేకరించిన కొన్ని ఆధారాలలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు కోసం సుమారు రూ. 20 కోట్ల రూపాయలు దారిమళ్ళాయి అని తేలింది. ఆ డబ్బును మద్యం కొనుగోలుకు వినియోగించినట్టు సమాచారం.

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన వందల కోట్ల రూపాయలు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయని.. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయి.

హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు రూ. 45 కోట్ల వాల్మీకి కార్పొరేషన్ డబ్బు బదిలీ అయిందని.. V6 బిజినెస్ పేరుతో ఉన్న ఖాతాకు రూ. 4.5 కోట్లు బదిలీ అయ్యాయి అని కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ అని టాక్ నడుస్తుంది. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడు అని సమాచారం. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి.

అంటే కాదు.. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారు అని కథనాలు వస్తున్నాయి.