ఏపీ ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలుసుకున్నారు. సెక్షన్-8 అమలు చేయాల్సిందిగా గవర్నర్ ను ఆదేశించాలని ఈ సందర్భంగా ఏపీ సీఎస్ విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతల తీరుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ ను గంగిరెద్దుగా పోలుస్తూ చేసిన విమర్శలకు వెంటనే సమాధానం చెప్పాలని, తెలంగాణలో ఏపీ పోలీసులను ఎలా దింపుతారు? పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఎట్లా చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సీఎం కేసీఆర్ మీద కేసులేమిటి? వాటి మీద ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం ఏమిటి? నియామకాలు, నిబంధనలు ఏవీ అక్కర్లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతినిధిగా రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ ను పట్టుకుని గంగిరెద్దు అని వ్యాఖ్యానిస్తారా? అని కడిగిపారేశారు. అంతేకాదు.. మీ తీరు ఇలాగే ఉంటే మిమల్ని ఎవరూ కాపాడలేరని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది.