mt_logo

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు

కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. కరీంనగర్ నుండి రోడ్డుమార్గం ద్వారా మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం వేములవాడ చేరుకున్నారు. సతీమణి శోభతో పాటు కుమార్తె ఎంపీ కవిత, అల్లుడు అనిల్, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావుతో కలిసి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం గర్భగుడిలో గణపతి పూజలు నిర్వహించి రాజరాజేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి అక్కడే దేవాలయ అభివృద్ధిపై చర్చలు జరిపారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో దేవస్థానానికి చేరుకున్న సీఎం దేవాలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

దేవాలయ అభివృద్ధిపై అధికారులు, సంబంధిత ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించిన తర్వాత విలేకరులతో సీఎం మాట్లాడారు. కాకతీయ రాజులకు ముందు నిర్మించిన వేములవాడ దేవాలయాన్ని రానున్న మూడు నాలుగేళ్ళలో అన్ని హంగులతో అభివృద్ధి చేసి చూపిస్తామని, దేవాలయ అభివృద్దితో పాటుగా వేములవాడ పట్టణాభివృద్ధి కూడా ఒకే సమయంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ఏటా రూ. 100 కోట్లను బడ్జెట్ లో కేటాయిస్తామని, తక్షణం రూ. 100 కోట్లు మంజూరు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో దేవాలయ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

దేవాలయానికి చుట్టూ 1200 మీటర్ల మేరకు మూడు, నాలుగు అంతస్థుల భవనాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేవాలయాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ట్యాంక్ బండ్ తరహాలో చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ దేవస్థానం ముందు రోడ్డును కొంత వెడల్పు చేస్తే బాగుంటుందని, దేవాలయ, పట్టణాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు ఈ విషయంలో కలిసి రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 47 సంవత్సరాల క్రితం తన పెండ్లి రాజరాజేశ్వర స్వామి సన్నిధిలోనే జరిగిందని, తాను ఆమరణదీక్షకు వెళ్లేముందు వేదపండితుల సూచనల మేరకు రాజన్న దర్శనం చేసుకుని వెళ్లానని, అప్పుడే తెలంగాణ సాధించి వస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు రావాలనుకున్నానని, అయితే పనుల ఒత్తిడిలో ఉండి కొంత ఆలస్యమైందని కేసీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *