mt_logo

కేసీఆర్ నిర్ణయాలకు ప్రజాబలం.. పాలకపక్షానికి కష్టంగా ఎంపీ ఎన్నికలు: పంచాంగ శ్రవణంలో పండితులు

బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికలు పాలకపక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని పండితులు తెలిపారు.

ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందని చెప్పారు.  శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని దీని వలన వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయన్నారు.  వ్యవసాయ రంగాలనిక అనుకూలంగా ఉంటుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయన్నారు.

ఈ సంవత్సరం ధరలు అధికమవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల్లో పాలకపక్షంగా ఉన్నవారికి కొంత కష్టసాధ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షంగా ఉన్నవారు ప్రయత్నిస్తే దిగ్విజయ ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పారు.

కేసీఆర్‌ రాశి కర్కాటక రాశి అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా ఉందని.. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నాడని.. ఈ సంవ్సతరమంతా వీరికి బాగుంటుందని తెలిపారు. కేసీఆర్ చేసే వ్యవహరాల్లో మంచి విజయం చేకూరే అవకాశాలున్నాయని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. కేసీఆర్ మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని అన్నారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని సూచించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ది మకర రాశి అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజ్యపూజ్యం 3, అవమానం 1 గా ఉందని పండితులు తెలిపారు. ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్‌గా చేయాలని సూచించారు.  ఈ రాశి వాళ్లు ప్రజలు, పార్టీలో అందరి అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందన్నారు.

ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ కేటీఆర్ శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ఉగాది వేడుక‌ల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ‌కీయాలు ఎప్పుడూ ఉంటాయి. పండుగ‌పూట రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌దు. ఈ సంవ‌త్స‌రం అంద‌రికీ మంచి జ‌ర‌గాలి. మ‌త‌క‌ల్లోలాలు లేకుండా ప్ర‌జ‌లంద‌రూ శాంతియుతంగా ఉండాలి. వ్య‌వ‌సాయం బాగుండాలి. వాతావ‌ర‌ణ అనుకూల ప‌రిస్థితులు రావాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు.