mt_logo

ఈనాడు బ్రాండ్ థాట్ పోలీసింగ్!

ఉద్యమ సమయంలో ఈనాడు లాంటి పత్రికలు తెలియకుండా, తేనె పూసిన కత్తుల్లా ఎలా వ్యవహరించాయో అనేకసార్లు రాసాము, మాట్లాడాము. తెలంగాణ ప్రజలను గందరగోళపరచడంలో అన్ని సీమాంధ్ర మీడియా సంస్థలు ప్రయత్నించినప్పటికీ ఈనాడు స్టైలే వేరు.

చాలా రోజుల తరువాత ఈనాడు విశ్వరూపం కనపడుతోంది మళ్లీ. రేవంత్ రెడ్డి వచ్చాక, వారికి సన్నిహితుడైన మనిషే అధికార పీఠం మీద కూర్చున్నాడన్న సంతోషంలో ఈనాడు అడ్డూ అదుపూ లేకుండా పేట్రేగిపోతోంది.

నిన్న పతాక శీర్శికలో ఈనాడు అచ్చోసి వదిలిన విషం చూడండి… కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి నల్లగొండ జిల్లాలోని దామరచెర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు వద్ద భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీటి నిర్మాణం పూర్తికావచ్చింది. ఈ సమయంలో అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి మిగతా అన్ని అభివృద్ధి పనుల మీద వేసినట్టే ఈ రెండు థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం మీద కూడా విచారణకు ఆదేశించాడు. అది ఉటంకిస్తూ ఇవ్వాళ ఈనాడు ఓ గొప్ప విషయం కనుక్కుని చంకలు గుద్దుకుంది.

అదేమంటే బొగ్గు గనులకు ఇంత దూరంలో థర్మల్ పవర్ స్టేషన్లు కడితే అక్కడ విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుందని. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సమీప బొగ్గు గని నుండి సుమారు 260 కిలోమీటర్లు ఉంటే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సమీప బొగ్గు గనికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇది చదివిన మామూలు పాఠకుడు ఎవరైనా నిజమే కదా కేసీఆర్ అంత పెద్ద తప్పిదం ఎలాచేశాడో అని అపోహపడేలా చేయడమే ఈనాడు అసలు ఎజెండా.

కానీ ఈనాడు మీకు చెప్పని విషయం ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బొగ్గు గనులకు 400 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరులో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్, 500 కిలోమీటర్ల దూరంలోని కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ , సుమారు 600 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నంలో సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టారని. వాటికి లేని దూరాభారం, అధిక వ్యయం 260 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు, కేవలం 80 కిలోమీటర్ల దూరంలోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఎలా అవుతుందో ఈనాడుకే ఎరుక!