తెలంగాణలో ఇప్పటికే వెంటిలేటర్ మీదున్న కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేతలు ఊపిరాడకుండా చేస్తున్నారు. తెలంగాణ సర్కారుపై అసత్యాలు ప్రచారం చేసి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని కుట్రపన్నిన హస్తం పార్టీకి సొంత నాయకులే షాక్ ఇస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు 115 మంది పేర్లను ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకంజ వేసింది. దమ్ముంటే అభ్యర్థులను ప్రకటించాలని, సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్. .ఇప్పుడు చడీచప్పుడు చేయకుండా ఉండిపోతున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు పోటీపడేవారు దరఖాస్తు చేసుకోవాలంటూ హస్తం పార్టీ తీసుకొచ్చిన ప్రయోగం ఘోరంగా విఫలమైంది. టికెట్ల కోసం అనామకులు కూడా పోటీపడుతుండటంతో కాంగ్రెస్ పరిస్థితి బోనులో చిక్కుకొన్న ఎలుకలా తయారయ్యింది.
హస్తంలో కొత్త పంచాయతీలు!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దరఖాస్తుల ప్రక్రియ సీనియర్ నాయకులు, అధిష్ఠానానికి కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. అసెంబ్లీ సీటుకోసం దరఖాస్తు చేసేందుకు అందరికీ అవకాశం ఇవ్వడంతో గ్రామస్థాయి నాయకులు కూడా దరఖాస్తు చేసుకొన్నారు. తామే స్థానికులమని తమకు టికెట్ దక్కాలని పట్టుబడుతున్నారు. సీనియర్ల లొసుగులు వెదికిమరీ వారికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఇందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది. ఇక్కడ ఓ రెండు చోట్ల తప్ప మిగతా అన్నిచోట్లా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకొన్నారు. తమకే టికెట్ వస్తుందని పేర్కొంటూ వర్గపోరుకు తెరలేపారు. ఎవరికి వారే ధీమాలో ఉండటంతో టీకాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరిపోయింది. ఇది ఒక్క ఉమ్మడి వరంగల్ పరిస్థితే కాదు.. యావత్తు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆదిలోనే హంసపాదులా తయారయ్యింది. టికెట్ల కేటాయింపులో పారదర్శకత పాటిస్తున్నామని ప్రజల్లో కలరింగ్ ఇచ్చేందుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తే.. అది మొత్తం పార్టీకే ఎసరు తెచ్చిందని సీనియర్లు వాపోతున్నారు. టికెట్ల కేటాయింపు తర్వాత కిందిస్థాయి లీడర్లంతా పార్టీనుంచి దూరంజరిగే ప్రమాదం వచ్చిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.