mt_logo

తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా తొలి నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు శాఖల్లో సివిల్ క్యాటగిరీల్లోని 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలను మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. 450 మార్కులకు పరీక్ష, 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటాయని, పరీక్ష ముగిసిన ఐదు రోజుల్లో కీ విడుదల చేసేందుకు, తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చక్రపాణి తెలిపారు. సెప్టెంబర్ మూడు వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉండగా, అదేనెల 20న పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో నిర్వహించనున్నట్లు వివరించారు.

వారంలో మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ విభాగాలలోని అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ప్రభుత్వం తమకు 3783 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని చక్రపాణి పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి(01-08-2015నాటికి) అన్ని కేటగిరీల వారికి కనీసం 18 ఏళ్ళు, గరిష్టం 44 ఏళ్ళు ఉంటుందని, వయోపరిమితి సడలింపు ఉన్న ఆయా వర్గాల వారికి మినహాయింపు వర్తిస్తుందని, స్కేల్ ఆఫ్ పే 37, 100- 91, 450 ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ మొదటివారంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కానున్నట్లు చక్రపాణి చెప్పారు.

మరోవైపు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎక్సైజ్, ఇతర శాఖల రిక్రూట్మెంట్లకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ప్రకటన విడుదల చేస్తామని, గ్రూప్స్ మినహా ఇతర పరీక్షలకు చెందిన అన్ని ప్రక్రియలను డిసెంబర్ లోగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా గ్రూప్స్ సిలబస్ విడుదల చేయనున్నట్లు, ఈ సిలబస్ ను కమిషన్ వెబ్ సైట్ http://tspsc.gov.in లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త సిలబస్ కాబట్టి సిలబస్ కు అనుగుణంగా సన్నద్ధం అయ్యేందుకు అభ్యర్థులకు సరిపడా సమయం లభిస్తుందని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ చివరికల్లా గ్రూప్-2 ప్రకటన వస్తుందని, నవంబర్ లేదా డిసెంబర్ లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యోగ నోటిఫికేషన్ పై ఓయూ విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. టీఎస్‌పీఎస్సీ వద్ద స్వీట్లు పంచుకుని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేశాయని, విద్యార్థులకు, నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చారని, విద్యార్థి లోకం సీఎం కేసీఆర్ వైపే ఉంటుందని స్పష్టం చేశారు. వీరే కాకుండా పలు విద్యార్థి సంఘాలు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *