తెలంగాణ పాలిట చంద్రబాబు పెద్ద శని అయితే రేవంత్ రెడ్డి చిన్న శనిలాంటి వాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ లో ఈరోజు జరిగిన మార్కెట్ యార్డు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. నాకు సభ్యత, సంస్కారం ఉన్నందునే గంట వరకు వేచి చూశానని, ఆయన రాలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అనవసర రాద్ధాంతం అని జూపల్లి విమర్శించారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రేవంత్ ఏనాడూ స్పందించలేదు. రేవంత్ గురించి ప్రజలకు బాగా తెలుసు.. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపాలని చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాస్తే రేవంత్ రెడ్డి మాత్రం లేఖ రాయలేదని అబద్ధాలు ఆడుతున్నాడని, ఆరునూరైనా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తీరుతామని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి వారం రోజుల్లో టెండర్లు పిలవబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాల్లోనే సమస్యలు పరిష్కరించేందుకు గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టామని చెప్పారు. తెలంగాణ వస్తే అంధకారం ఏర్పడుతుందని చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.. వారు చెప్పినవి అవాస్తవాలని తేలిపోయింది. వచ్చే వానాకాలం నుండి వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు, గృహాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో రోడ్ల కోసమే రూ. 130 కోట్లు కేటాయించామని, పాలమూరు ఎత్తిపోతల పథకంలో కొడంగల్ నియోజకవర్గ స్థాయిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని జూపల్లి కృష్ణారావు చెప్పారు.