రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ధీటుగా సమాధానం ఇవ్వనున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక అవగాహనా సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలపై అవగాహన కల్పించేలా ఎంపీలు, ఎమ్మెల్యేలను తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మరీముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న వివాదాన్ని తిప్పికొట్టాలని, మీడియాకు కూడా ఇవే విషయాలను వివరించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది.
సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సరైన ప్రాజెక్టులు లేక తెలంగాణ భూములు బీడువారాయని, గోదావరి, కృష్ణా నదులపై ఎక్కడ నీటి లభ్యత ఉంది? ఎక్కడ ప్రాజెక్టులు కడితే ఉపయోగం? ఏ ప్రాజెక్టులను రీ డిజైన్ చేయాలి? అనే అంశాలనన్నింటినీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమగ్రంగా వివరించాలని సీఎం భావిస్తున్నట్లు సంచారం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయిన సమగ్ర ఇంటింటి సర్వే, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం, మిషన్ కాకతీయ, దళితులకు మూడెకరాల భూమి, జలహారం, హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, హరితహారం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పించన్ల పెంపు, తాజాగా చేపట్టిన గ్రామజ్యోతి పథకం తదితర అంశాలకు సంబంధించి పూర్తి వాస్తవాలు ప్రజల్లోకి తీసుకొచ్చేలా పార్టీ నేతలను సమాయత్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.
ఇవేకాకుండా రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ) ఏర్పాటు చేయడం, ఉద్యోగుల విభజన పూర్తి కాకపోయినా, కనీసం కొన్ని ఉద్యోగాలనైనా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఇందులో భాగంగా ఈ సంవత్సరం 25వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం, దానికి అనుగుణంగా వెలువడుతున్న నోటిఫికేషన్లు తదితర వివరాలు కూడా సీఎం మీడియాకు తెలపనున్నారు.