టీఎస్‌పీఎస్సీ మంగళవారం ఒక్కరోజే అత్యధిక ఫలితాలు విడుదల చేసి రికార్డ్ సృష్టించింది. టీచర్ రిక్రూట్ మెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించి 2,528 ఉద్యోగాల భర్తీకి తుది ఫలితాలు ప్రకటించింది. వీటిని కూడా కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 20,600 కొలువులను భర్తీ చేసినట్లయ్యింది. 1,823 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, టీఆర్టీలో భాగంగా 653 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్(తెలుగు మీడియం), గురుకులాలకు చెందిన 52 టీజీటీ సైన్స్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
ఒకేరోజు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ పూర్తిచేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వివిధ కారణాల వల్ల కోర్టులో పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు సైతం త్వరలో భర్తీ అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు దాదాపు 36 వేల కొలువుల భర్తీకి 101 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో మంగళవారం నాటికి 20,600 కొలువుల భర్తీ పూర్తయింది. మిగతావి కోర్టు కేసులు, ఏజెన్సీ, దివ్యాంగ అభ్యర్థుల ధ్రువపత్రాలు, మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ లో ఉన్నాయి. అవికూడా త్వరలో కొలిక్కి వచ్చి కొలువులు భర్తీ అవుతాయని తెలుస్తుంది.