పౌరసరఫరాల సంస్థకు చెందిన 170 మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో పనిచేస్తున్న స్వీపర్లకు మానవతా దృక్పథంతో జీతాలను పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదాముల సామర్ధ్యానికి అనుగుణంగా ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలకు నెలకు రూ. 750 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈనెల ఒకటవ తారీఖు నుండి అమల్లోకి రానుంది. గోదాముల్లో పనిచేస్తున్న దాదాపు 200 మంది మహిళా స్వీపర్లకు లబ్ధి చేకూరనుండగా, పెంచిన వేతనాల వల్ల సంస్థపై ఏడాదికి రూ.17.55 లక్షల భారం పడనుంది.
ఇప్పటివరకు 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల్లో పనిచేస్తున్న స్వీపర్లకు నెలకు రూ. 1500, 500 నుండి 1000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల్లో పనిచేస్తున్న వారికి రూ. 2 వేలు, వెయ్యి మెట్రిక్ టన్నులకు పైగా సామర్ధ్యం ఉన్న గోదాముల్లోని స్వీపర్లకు రూ. 2,500 చెల్లిస్తున్నారు. గత నెలలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి వేతనాలు పెంచాలని స్వీపర్లు చేసిన విజ్ఞప్తిపై స్పందించి ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.