చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ అదే ఉద్యమస్ఫూర్తితో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా ప్రజారంజక పాలన అందిస్తున్నారు. దీంతో అన్ని రంగాల్లో అనతికాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ పాలన దేశానికే చుక్కానిలా మారింది. దీంతో తెలంగాణలో ప్రతిపక్షం అనే మాట వినిపించకుండా పోయింది. గుడ్దెద్దు చేల్లో మేసినట్టు కాంగ్రెస్, బీజేపీలు తమ డాంభికాన్ని ప్రదర్శిస్తున్నా కేసీఆర్‌ను కొట్టే దమ్ము, ధైర్యం ఆ రెండు పార్టీలకు లేదు. దీంతో అవి చీకటి ఒప్పందం చేసుకొని, కేసీఆర్‌ను ఎదుర్కోవాలని పన్నాగం పన్నాయి. ఈ విషయం నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా తేటతెల్లమైంది. ఇప్పుడు ఆ రెండు పార్టీల లోగుట్టును నిన్నటివరకూ బీజేపీలో ఉన్న బహిష్కృత నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బయటపెట్టారు.
యెన్నం చెప్పిన వాస్తవం ఇదే..!
ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు బీ టీం అని బీజేపీ.. బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ వస్తున్నాయి. అటు కాంగ్రెస్‌తో కలువక.. కేంద్రంలోని బీజేపీని ఎండగడుతూ సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ సర్కారును అభాసుపాలు చేసేందుకు ఆ రెండు జాతీయ పార్టీలు అడ్డమైన ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాన్ని చేసుకొన్నాయని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. జాతీయస్థాయిలో తాము పరస్పర విరుద్ధమంటూ చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఇప్పటివరకూ తెలంగాణలో ఎన్నోసార్లు మిలాఖత్ అయినట్టు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ నేతలు తనతోపాటు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చలు జరిపారని, కేసీఆర్ సర్కారును కొట్టేందుకు సహకారం అందించాలని కోరారని తేటతెల్లం చేశారు. వివేక్, ఈటల, రాజగోపాల్‌రెడ్డి, రవీంద్రనాయక్.. ఇలా ఇంకొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో చర్చించిన విషయాలను బయటపెట్టారు. అలాగే, తెలంగాణ ఉద్యమ కీలక సమయంలో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. సమైక్యవాదుల చేతిలో కీలుబొమ్మగా ఎలా మారారో కూడా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బహిర్గతం చేశారు. కాగా, కేసీఆర్‌కున్న ప్రతిష్ఠ, బీఆర్‌ఎస్‌కున్న బలాన్ని ఎదుర్కోలేక వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌ను దెబ్బతీసే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలపడం ఏమిటి? ఇదెక్కడి దిక్కుమాలిన వైఖరి అని ప్రజలు, తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తాము అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని, ఎవరెన్ని ట్రిక్కులు ప్లే చేసినా బీఆర్ఎస్‌కే హ్యాట్రిక్ విజయం అందిస్తామని అంటున్నారు.