బీజేపీ ఏ ఎన్నికల్లోనైనా ప్రజల్లో ఎమోషనల్స్‌ను రెచ్చగొట్టి గెలువాలని చూస్తుందనే విమర్శ బలంగా ఉన్నది. ఇంతకుముందు కశ్మీర్ స్వయంప్రతిపత్తి, అయోధ్య రామ మందిరం, మెజార్టీ-మైనార్టీల మధ్య గొడవలులాంటివాటిని తమ ఓటుబ్యాంకుగా మల్చుకున్నదని రాజకీయ మేధావుల విశ్లేషణ. ఇదే ఫార్మాలను తెలంగాణలోనూ ప్రయోగించి ఆ పార్టీ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పాగా వేసేందుకు ఇప్పడు దేశం పేరు మార్పు అనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని బీజేపీ చూస్తున్నదని, ఈసారి ఈ అంశాన్ని బలంగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆ పార్టీ ఇటీవల వ్యవహారం చూస్తే అర్థమైపోతున్నది. సార్వత్రిక ఎన్నికలను సరిగ్గా ఓ పదినెలల ముందునుంచి తన ప్లాన్‌ను అమలుచేస్తూ ఓ వర్గం ఓట్లు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.
దేశం పేరు మార్పుపై మరో సంకేతం
కేంద్రంలోని బీజేపీ సర్కారు మొన్న జీ20 అతిధులకు పంపిన విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై అటు ప్రజలు, మేధావులు, ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ సర్కారు కావాలనే ఇలా చేసిందని, దేశం పేరు మారుస్తారనేందుకు ఇది సంకేతమని ఆందోళన వ్యక్తంచేశారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పాల్గొనే ఈస్ట్ ఏషియా సదస్సు సందర్భంగా రూపొందించిన ఆహ్వాన పత్రికలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బదులు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని రాశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ సర్కారు దేశం పేరు మార్చే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నదని, ఇందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను వాడుకొనేందుకు చూస్తున్నదనే చర్చ నడుస్తున్నది. దేశంలో పేదల బతుకులు మార్చకుండా.. దేశం పేరు మారిస్తే ఏమొస్తదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇండియా పేరును భారత్‌గా మారిస్తే దేశానికి ఇన్నిరోజులున్న గుర్తింపుపోవడంతోపాటు దేశ పౌరులు తమ గుర్తింపు పత్రాలన్నింటిలోనూ ఇండియా అని మార్పించుకొనేందుకు నోట్ల రద్దుటైంలో మాదిరిగా కష్టాలు పడాల్సిన దుస్థితి వస్తుందనే ఆందోళన కనిపిస్తున్నది. ఎలాంటి ప్రయోజనం లేకుండా.. ఎలాంటి కారణం లేకుండా దేశం పేరును ఎలా మారుస్తారనే ప్రశ్నలు మెజార్టీ ప్రజలనుంచి వినిపిస్తున్నాయి.