టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరుసగా ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం కేసీఆర్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేకే మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం చారిత్రాత్మకమన్నారు. ఆరు దశాబ్దాలుగా చేయలేదు కాబట్టే కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారని, కేసీఆర్ నాయకత్వం దొరకడం మనందరి అదృష్టమని చెప్పారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ కార్యకర్తలేనని, వారి త్యాగఫలితమే తెలంగాణ అని, కార్యకర్తలు ఏనాడూ జెండా కింద పెట్టకుండా విజయం సాధించేదాకా ప్రయాణం చేశామని చెప్పారు. గోల్కొండలో తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేశామని, బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించుకున్నామన్నారు. అమరవీరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, దళితుల జీవితాల్లో వెలుగులు రావాలని మూడెకరాల భూపంపిణీ పథకం తీసుకొచ్చామని, ఇప్పటివరకు 2045 ఎకరాల భూమి పంచామని చెప్పారు. గిరిజనులు, దళితులు, మైనార్టీ ఆడపిల్లల పెండ్లికి కష్టం కాకూడదనే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టామన్నారు.