mt_logo

తెలంగాణ గడ్డపై పుట్టి అభివృద్ధిలో పాలుపంచుకోకపోతే సహించం!

వరంగల్ జిల్లా పాలకుర్తిలో నిర్మించనున్న చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డ్ గోడౌన్ శంకుస్థాపన విషయంలో నిన్న జరిగిన గొడవ సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాకముందే గోడౌన్ శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్ యార్డులోని శిలాఫలకాన్ని ప్రారంభించడానికి కార్యకర్తలతో కలిసి ఎర్రబెల్లి వెళ్ళగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అంతటితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలు అక్కడున్న టెంట్ ను కూల్చేసి ఎర్రబెల్లితో కలిసి మార్కెట్ బయట నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎండీ ఉస్మాన్ షరీఫ్ మార్కెట్ కు వచ్చి పరిస్థితిని చక్కదిద్దేందుకు లాఠీచార్జి చేశారు. దీంతో ఎర్రబెల్లి నా కార్యకర్తలనే కొడతావా అంటూ ఎస్సైపై తిరగపడటంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు రాళ్ళతో ఎస్సైపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్సై షరీఫ్ తలకు తీవ్ర గాయం అవ్వడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఇన్చార్జి డీఎస్పీ జాన్ వెస్లీ అక్కడికి చేరుకొని ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ ఘటనపై మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్ ఎర్రబెల్లిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రబెల్లి దళిత వ్యతిరేకి అని, కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం అవడాన్ని జీర్ణించుకోలేక ఎర్రబెల్లి నిన్న గూండాలాగా ప్రవర్తించి పోలీసులపై దాడి చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు మెప్పుకోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని, పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదనే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టి అభివృద్ధిలో భాగం పంచుకోకుండా టీఆర్ఎస్ పై జులుం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే వినయ భాస్కర్ మాట్లాడుతూ, టీడీపీ నేతలు ప్రభుత్వంపై దాడులకు దిగుతామంటే సహించమని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్ లో ఎర్రబెల్లి, రేవంత్ ఆంధ్రా ఏజెంట్స్ గా వ్యవహరిస్తున్నారని, వీరిద్దరూ తెలంగాణ బిడ్డలే అయితే రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రావాలని వినయ్ భాస్కర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *