mt_logo

ఢిల్లీలో జయశంకర్ సార్‌కు ఘన నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కేపీ వివేకానంద, రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జీవితమంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభవులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారితో కలిసి తెలంగాణ కోసం ఢిల్లీలో పలు రాజకీయ పార్టీలను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డారు. అదే ఢిల్లీ వేదికగా ఇవ్వాళ మేమంతా ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం అని తెలిపారు.

ఏ తెలంగాణ కోసం జయశంకర్ సార్ జీవితమంతా కష్టపడ్డారో ఇవ్వాళ ఆ తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్ల పాటు సవ్యమైన దిశలో తెలంగాణ నడిచింది. ఇప్పుడున్న పాలకులు కూడా జయశంకర్ ఆశయాలను నేరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతున్నా అని అన్నారు.

జయశంకర్ గారికి కేసీఆర్ గారు ఘనమైన నివాళులు అర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెట్టాం. మన రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయానికి ఆయన పేరు పెట్టుకున్నాం అని కేటీఆర్ గుర్తుచేశారు.

అది ఆయనకు మా పార్టీ, ప్రభుత్వం, తెలంగాణ సమాజం తరపున అందించిన చిరు నివాళి. వారు ఎక్కడ ఉన్నా పూర్తి స్థాయిలో ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం అని అన్నారు.