స్ట్రైక్ఆఫ్ అయిన కంపెనీ తెలంగాణలో ఎట్లా పెట్టుబడులు పెడుతుంది.. ఫ్రాడ్ కంపెనీల నుంచి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళారా అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో క్రిశాంక్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి. బీఆర్ఎస్ హయాంలో ఐటీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. 2023 నుండి 2024 వరకు పెట్టుబడులు సగం పడిపోయాయి అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దావోస్ వెళ్లి గోదీ ఇండియా అనే సంస్ధతో ఒప్పందం కుదుర్చుకున్నారు.. అది ఒక ఫ్రాడ్ కంపెనీ అని తేలింది అని అన్నారు.
మూసీ ప్రాజెక్టుపై లక్షన్నర కోట్ల రూపాయలకు అంచనాలు పెంచారు. మూసీ ప్రాజెక్టు అప్పగించే సంస్థపై లుక్అవుట్ నోటీసు వచ్చింది. తెలంగాణ మహిళలకు ఉపయోగపడే రూ. 839 కోట్ల పెట్టుబడి వచ్చిందని వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం కార్యాలయం తెలిపింది అని పేర్కొన్నారు.
సీఎం అమెరికా పర్యటనలో ఉన్నారు.. సీఎం తమ్ముడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. వాల్ష్ కర్రా హోల్డింగ్స్ నాలుగు నెలల క్రితమే ప్రారంభం అయింది. ఈ కంపెనీకి కేవలం ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.. వారిద్దరికీ చెరో యాభై షేర్లు ఉన్నాయి అని తెలిపారు.
సీఎంది ప్రైవేటు పర్యటన కాదు అధికారిక పర్యటన అని గుర్తు పెట్టుకోవాలి. తెలంగాణ ప్రజల ధనంతో బృందాలుగా అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్ళారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తెలంగాణకు పెట్టుబడుల కోసం ఒరిజినల్ కోసం కంపెనీలను తీసుకురండి అని దుయ్యబట్టారు.
ఇప్పటి వరకు తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మీ పథకం కింద రూ. 2,500 ఇస్తామని ప్రభుత్వం ఇవ్వలేదు. బోగస్ కంపెనీలు తెలంగాణ మహిళల కోసం పెట్టుబడులు ఎట్లా పెడతాయి అని ప్రశ్నించారు.
కేటీఆర్ కంటే తాను మెరుగ్గా చేశానని చెప్పడం కోసం సీఎం రేవంత్ రెడ్డి బోగస్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరితో ఒప్పందం చేసుకున్నా వారి ట్రాక్ రికార్డ్ మంచిగా ఉండాలి ఆని క్రిశాంక్ కోరారు.