నాడు ఓటుకు నోటు తరహాలోనే.. నేడు రేవంత్ నడిపిన సీటుకు నోటు వ్యవహారం టీకాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. కాంగ్రెస్‌లో ‘సీటుకు నోటు’ అంశం ప్రకంపనలు సృష్టించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ వ్యవహారం’ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. టికెట్ కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఐదెకరాల భూమి, రూ.10 కోట్లు ఇచ్చానంటూ కొత్త మనోహర్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడని అదే నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్న మరికొందరు నాయకులు మీడియా సమావేశంలో ఆరోపించడం కలకలం రేపింది. ఈ అంశం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కౌన్ బనేగా కరోడ్‌పతి పేరిట ఈ వ్యవహారం సోషల్‌మీడియాలో రెండు రోజులుగా ట్రెండింగ్ కాగా.. అటు రేవంత్‌రెడ్డిని.. ఇటు కాంగ్రెస్ పార్టీని నెటిజన్లు, తెలంగాణవాదులు చెడుగుడు ఆడుకొన్నారు. ‘సీటుకు నోటు’ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్ఠానం.. మీడియా సమావేశం నిర్వహించిన నేతలను మందలించినట్టు తెలిసింది. అలాగే, కొత్త మనోహర్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి బుధవారం వెల్లడించారు.
ఈ వ్యవహారంలో మరోనేత!
మీడియా ఎదుట టీపీసీసీ చీఫ్ లోగుట్టు బయటపెట్టిన కొత్త మనోహర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంతో ‘సీటుకు నోటు’ వ్యవహారం
మరో ట్విస్ట్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. టికెట్ కోసం డబ్బులు ఇచ్చానని చెప్పుకుంటున్నకొత్త మనోహర్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డితోపాటు మరో నేతకు కూడా డబ్బులిచ్చినట్టుగా తన సన్నిహితులకు చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో మీడియా ఎదుట కుండబద్ధలు కొడతానని మనోహర్‌రెడ్డి అంటున్నాడట. తానొక్కడిపైనే సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని, దీనిపై పూర్తిగా విచారణ చేసి, డబ్బులిచ్చానంటున్న వ్యక్తిపైనా చర్యలు తీసుకోవాలని మనోహర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సీటుకు నోటు వ్యవహారం తెలంగాణలో కాంగ్రెస్ భవితవ్యం మీద పెద్ద దెబ్బేనని సీనీయర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.