mt_logo

తొలి తెలంగాణ పీఆర్సీ ఫిట్ మెంట్ 43%గా నిర్ణయం!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. ఉద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీ ఫిట్ మెంట్ ను 43%గా నిర్ణయిస్తూ సీఎం ప్రకటించారు. చరిత్రలో ఇదే అత్యధికమని, పెరిగిన వేతనాలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుండే అమల్లోకి వస్తాయని గురువారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించారు. పెరిగిన వేతనాలు జూన్ 2014 నుండి 2015 ఫిబ్రవరి వరకు జీపీఎఫ్ లో జమచేస్తామని, మార్చి నెల జీతం నుండి నగదు రూపంలో అందుతాయన్నారు. జీపీఎఫ్ లో జమచేయడం వల్ల ఉద్యోగులకు 8.5 శాతం వడ్డీ వస్తుందని, ఇలా పెంచడం వల్ల ప్రభుత్వంపై సాలీనా రూ.6500 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికీ ప్రభుత్వ కుటుంబ సభ్యులైన ఉద్యోగులకు ఎక్కువ మేలు జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ రాష్ట్రంలో తొలి తెలంగాణ పీఆర్సీ అని సీఎం చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర చాలా గొప్పదని, వారు చాలా త్యాగాలు చేశారని, ఉద్యమ సమయంలో ఉద్యోగులు అగ్రస్థానంలో నిలిచారని సీఎం గుర్తుచేశారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారి కష్టాలను, ఇబ్బందులను తాము ఎల్లవేళలా పరిగణనలోకి తీసుకుంటూనే ఉంటామన్నారు. సకల జనుల సమ్మె వంటి చారిత్రాత్మక ఉద్యమాలలో మొత్తం తెలంగాణను స్తంబింపచేయడంలో ఉద్యోగులు గొప్ప పోరాటం చేశారని, అప్పటి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత నష్టం చేసినా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేశారని కీర్తించారు. ముఖ్యమంత్రి ప్రకటన పట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సమావేశం కొనసాగినంత సేపూ జై తెలంగాణ నినాదాలు చేశారు. పీఆర్సీ ఫిట్ మెంట్ ఫైలుపై గురువారం రాత్రి ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ సంతకం చేశారు. దీనికి సంబంధించిన జీవో శుక్రవారం విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *