mt_logo

ఢిల్లీలో సీఎం కేసీఆర్.. ఐదు రోజులపాటు అక్కడే..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఐదురోజుల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం ఆయన నివాసంలో జరగనున్న నీతి ఆయోగ్ తొలి సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. కేంద్ర బడ్జెట్ ను రూపొందించనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రణాళికలు, రాష్ట్రాలకిచ్చే బడ్జెట్ కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరపనున్నారని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి మీడియాకు వివరించారు.

శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర ఇనుము-ఉక్కు శాఖల మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తో భేటీ అయ్యి ఖమ్మం జిల్లా బయ్యారం స్టీల్ ప్లాంట్ పై చర్చించనున్నారు. అనంతరం పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో మధ్యాహ్నం 2.15 గంటలకు భేటీ అయ్యి ప్రాణహిత-చేవెళ్ళ, దేవాదుల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ అనుమతులపై చర్చించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మతో భేటీ అయ్యి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్రానికి సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపైన ప్రధాని సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చిస్తారని, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా మరింత విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి కేంద్రం ఇప్పటికే 4000 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినందున సింగరేణి బొగ్గు గనుల్లో 49% బొగ్గు కోటాను తెలంగాణకు కేటాయించాల్సిందిగా కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారని వేణుగోపాలాచారి తెలిపారు. ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో జరిగే సమావేశంలో విద్యుత్ అంశాలపై చర్చిస్తారని, అనంతరం కేంద్ర ఆర్ధికమంత్ర్రి అరుణ్ జైట్లీతో శనివారం భేటీ అయ్యి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఇచ్చే ఆర్ధికవనరులను మొత్తం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే చెల్లించాలని కోరడంతోపాటు ప్రత్యేక ప్యాకేజీలను ఇవ్వాల్సిందిగా ఆర్ధికమంత్రికి విజ్ఞప్తి చేస్తారని వేణుగోపాలాచారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *