mt_logo

తెలంగాణ ఉద్యమ సత్తా చాటిన గడ్డ నకిరేకల్ – కేటీఆర్

నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఈరోజు రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సత్తా చాటిన గడ్డ ఏదంటే అది నకిరేకల్ మాత్రమేనని, ఉద్యమంలో నకిరేకల్ ఘనమైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నకిరేకల్ ప్రజలు కోరిన డ్రైనేజ్ మంజూరు చేస్తామని, రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే జిల్లాగా నల్లగొండ జిల్లా మారబోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. దామరచర్లలో అతిపెద్ద పవర్ ప్లాంట్ నిర్మిస్తామని, జిల్లాలో ఫ్లోరైడ్ కష్టాలు తొలగించాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, జిల్లా ప్రజల దాహం తీర్చే నక్కలగండి పథకానికి సీఎం అనుమతి ఇచ్చారని మంత్రి తెలిపారు.

ఉద్యమంలో దొంగల్లాగా ఉన్నవారు ఇవ్వాళ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ హయాంలో పాలన సరిగ్గా జరగలేదన్నారు. తమది పేదల ప్రభుత్వమని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న సీఎం కేసీఆర్ పైనే కేసులు పెడతారా? తెలంగాణను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నందుకా? సీఎం కేసీఆర్ పైన కేసులు పెట్టేది అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలెప్పుడో చెత్త బుట్టలో వేశారని, అధికారం కోల్పోయిన కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ నుండి పరిపాలిస్తుంటే ఇతర దేశం నుండి పాలిస్తున్నట్లుగా ఉందన్న చంద్రబాబు పచ్చపార్టీని ఇక్కడి నుండి తరిమికొట్టాలని, తెలంగాణ ఉద్యమంలో సమాజమంతా సీఎం కేసీఆర్ వైపు ఉన్నట్లుగానే బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా మనమంతా కేసీఆర్ వెంట నడవాలని మంత్రి సూచించారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకే సీఎం కేసీఆర్ భీమా పథకాన్ని ప్రవేశపెట్టారని, టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *