అసెంబ్లీలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగించారు. గౌరవనీయులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలిపేందుకు సభా నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తున్నం అని అన్నారు.
వారు పెద్దల సభలో 33 సంవత్సరాలు పనిచేశారు..ఈరోజు మన పెద్దల సభ శాసనమండలిలో కూడా వారికి నివాళులర్పిస్తే మరింత బాగుండేది. ఎందుకు మండలిలో పెట్టలేదని చాలా మంది అడుగుతున్నారు అని అన్నారు.
మన్మోహన్ సింగ్ గారు మనమధ్య లేకపోయినా, వారి సేవలు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయి. సామన్య కుటుంబంలో పుట్టి, వీధి దీపాల మధ్య, లాంతర్లు పెట్టుకొని, స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకొని అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. ఆర్థికశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా, దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే, వారి క్రమశిక్షణ గలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనే పట్టుదలే కారణం. విదేశాల్లో కూడా వారికెన్నో గొప్ప అవకాశాలొచ్చాయి. విదేశాల్లో పెద్ద ఉద్యోగాలను తిరస్కరించి, ఈ దేశం నాకు ముఖ్యం అని మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు వారు అని కొనియాడారు.
వారేనాడూ పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు, పదవులే ఆయన దగ్గరకు వచ్చాయి. యూజీసీ చైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా, ఆటమిక్ ఎనర్జీ, స్పేస్ కమిషన్ సభ్యుడిగా, దేశ ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఎన్నో గొప్ప పదవుల్ని అంకితభావంతో నిర్వహించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారిని దేశ రాజకీయాలకు పరిచయం చేసింది మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావు గారు. పీవీ గారు తన కేబినెట్లో మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకున్నారు అని గుర్తు చేశారు.
పీవీ గారు నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థికరంగానికి తనదైన శైలిలో దశ దిశను చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసిన తొలి ప్రసంగం దేశంలో అత్యుత్తమ ప్రసంగంగా రికార్డుల్లో మిగిలిపోయింది. పారిశ్రామిక విధానాలను మార్చి పీవీ గారు గొప్ప పేరు తెచ్చుకుంటే, ఆర్థిక విధానాలను సవరించి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పేరు తెచ్చుకున్నారు. దేశాన్ని దివాళా పరిస్థితుల నుంచి గట్టెక్కించిన పీవీ గారికి మన్మోహన్ సింగ్ గారు ఒక చోదకశక్తిగా పనిచేశారు అని హరీష్ రావు ప్రశంసించారు.
మన్మోహన్మిక్స్ అనే స్థాయికి దేశ ఆర్థిక విధానాలను ప్రభావితం చేశారు. మన్మోహన్ సింగ్ గారు మచ్చలేని నాయకుడు, అత్యంత ఉన్నతంగా సాధాసీదా జీవితం గడిపిన మహనీయులు. యూపీఏ-2లో చాలా కుంభకోణాలు, కేసులు, అరెస్టులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి..అయినా మన్మోహన్ సింగ్ గారికి ఒక చిన్న మచ్చకూడా రాలేదంటే వారి గొప్పతనమే. అకడమిషీయన్గా, అడ్మినిస్ట్రేటర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ గారు దేశంపై తనదైన ముద్ర వేశారు. ఆర్బీఐ గవర్నర్‌గా కరెన్సీ నోట్లపై సంతకం చేసిన మన్మోహన్ సింగ్ గారు ఆర్ధిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశంపై చెరగని సంతకం చేశారు. తరతరాలు గుర్తుంచుకునేలా ఆయన జీవితం దేశ సేవలో ధన్యమైంది అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, సంపూర్ణ మద్దతిస్తుంది. మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టడానికి మేం మద్దతు పలుకుతున్నం. కారణాలేమోగానీ పీవీ గారు మరణించిన రోజు పట్టించుకోలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పీవీ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. పీవీ గారి పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేసి, పీవీ గారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్డుకు పీవీ గారి పేరును పెట్టి, వారి జయంతి, వర్థంతులను అధికారికంగా జరిపించార. పీవీ గారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపి, మన పీవీ, మన ఠీవి అని వారి ఖ్యాతిని చాటారు బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు అని గుర్తు చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని కోరుతున్నాను. మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని ఈరోజు సభలో పెట్టిన తీర్మానాన్ని మేం సమర్థిస్తున్నం.ఇదే సభలో కేసీఆర్ గారు పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, వారికి భారతరత్న ఇచ్చారు. మన్మోహన్ సింగ్ గారు లాయలిస్టు. వారికి ఎన్నో చేదు అనుభవాలు జరిగాయి. వారిని మౌనముని అన్నారు అని తెలిపారు.
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఐదేండ్ల మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపారు పీవీ, మన్మోహన్ గార్లు ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోతే, ఆ ఓటమికి మన్మోహన్ సింగ్, పీవీ ఆర్థిక విధానాలు కారణమని ఏఐసీసీ ఆంటోనీ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీనిపై ఏఐసీసీలో చర్చపెడితే కంటతడి పెట్టారే తప్ప, తనను తప్పుపట్టారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు మన్మోహన్. అందుకే ఆయన్ను లాయలిస్టు అన్నారు. ఆనాడు మన్మోహన్ గారు కంటతడి పెట్టిన వార్తపై దేశమంతా చర్చ జరిగింది అని అన్నారు.
మరో సందర్భంలో యూపీఏ భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ గారికి 2 ఏండ్ల జైలు శిక్ష పడితే, వారిని రక్షించేందుకు ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. అపుడు మన్మోహన్ ప్రధానిగా ఉన్నారు. తమ నిర్ణయం సరైందేనని చెప్పాలని ఏఐసీసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడికి రాహుల్ గాంధీ గారు వచ్చి ఆర్డినెన్స్ కాపీలను చింపివేశారు. ఒక ప్రధానిగా మన్మోహన్ సింగ్, వారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, రాహుల్ గాంధీ గారు తప్పుపట్టారు. అయినా, మన్మోహన్ గారు మౌనమునిలాగానే ఉన్నారు తప్ప, నోరు తెరవని లాయలిస్టు, గొప్ప వ్యక్తి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా కాంగ్రెస్ పార్టీ పట్ల మన్మోహన్ సింగ్ గారి లాయలిటీ గొప్పది అని హరీష్ రావు అభినందించారు.
మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నపుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో ప్రకటన చేశారు.రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అపుడు మన్మోహన్ సింగ్ గారు పిలిచి, కేంద్ర క్యాబినెట్లో చేరండి అని కేసీఆర్ గారిని అడిగారు అప్పుడు కేసీఆర్ గారు తాము మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే వచ్చామని బదులిచ్చారు. అప్పుడు మేం తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తాం అని సోనియా, మన్మోహన్ హామీ ఇవ్వగా, కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చాలని కోరిన తర్వాతే కేబినెట్లో చేరేందుకు అంగీకరించారు అని అన్నారు.
కేంద్ర నౌకాయాన మంత్రిగా కేసీఆర్ గారికిస్తే, డీఎంకే పార్టీ కోసం ఆ శాఖను తిరిగి ఇచ్చేశారు కేసీఆర్ గారు. ఆ సమయంలో 6 నెలల పాటు ఏ శాఖ లేని కేంద్రమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసమే శాఖలేని మంత్రిగా ఉండాల్సి వచ్చింది. ఆరోజు కేసీఆర్ గారిని మన్మోహన్ సింగ్ గారు ప్రశంసించారు అని అన్నారు.