mt_logo

10-12 సీట్లు మాకు అప్పగించండి.. తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు: కేటీఆర్

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సనత్ నగర్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ గట్టిగా అనుకుంటే కిషన్ రెడ్డికి, దానం నాగేందర్‌కు డిపాజిట్ వస్తదా అని పేర్కొన్నారు.

2014 బడే భాయ్ మోసం చేసిండు.. 2023 చోటే భాయ్ మోసం చేసిండు. హైదరాబాద్‌లో మీరు మోసపోలే.. మాకు 16 సీట్లు ఇచ్చిన్రు. జిల్లాల్లో ప్రజలు మోసపోయిన్రు.. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏదో చేస్తారనుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో పరిస్థితి ఏమైంది.. కొత్త పెట్టుబడులు తెచ్చే మొఖం లేదు.. ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయి అని దుయ్యబట్టారు.

మెడల పేగులు వేసుకుంట.. జేబుల కత్తెర పెట్టుకుంట అని అంటాడు.. ముఖ్యమంత్రి అట్ల మాట్లాడుతాడా? లంకె బిందెలు ఉన్నాయకున్నా అంటాడు? లంకె బిందెల కోసం పచ్చి దొంగలు కదా తిరుగేది? ఐదు గ్యారంటీలు అమలు చేసినమంటూ సిగ్గులేకుండా అబద్దాలు చెప్తుండు.. మహిళలకు రూ. 2,500, తులం బంగారం, రూ. 4 వేలు, రూ. 500 బోనస్ వచ్చిందా? అని అడిగారు.

ఇంకా దారుణమేమిటంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు..మన పార్టీ నుంచి గెలిచిన వ్యక్తే ఇప్పుడు పోయి కాంగ్రెస్‌లో పోటీ చేస్తుండు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే లాభపడితే బీజేపీయే.. బీజేపీ మనకు చేసిన మోసం మామాలుది కాదు అని కేటీఆర్ అన్నారు.

కిషన్ రెడ్డి ఐదేళ్లుగా ఒక్క పని చేసిండా? ఒక్కరికైనా ఇళ్లు కట్టించాడా.. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయ్ ఇవ్వలే.. గుజరాత్‌కు మాత్రం మోడీ వెయ్యి కోట్లు తీసుకుపోయిండు. ఏం చేసినవ్ అని కిషన్ రెడ్డిని అడిగితే జై శ్రీరామ్ అంటాడు.. మేము గుడి కట్టినం అంటాడు. గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ గారు కట్టలేదా యాదాద్రి.. దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా? అని ధ్వజమెత్తారు.

కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టారు.. రిజర్వాయర్లు, చెరువులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసిండు. వాటికి కూడా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, కొండ పోచమ్మ సాగర్ అని దేవుళ్ల పేరు పెట్టిండు.. మీ కన్నా ఎక్కువగా దేవుళ్లను గౌరవించేది కేసీఆర్ గారు మాత్రమే అని స్పష్టం చేశారు.

బీజేపోళ్లే మనకు కట్టు, బొట్టు నేర్పినట్లు బిల్డప్‌లు ఇస్తారు.. వాళ్ల కన్నా ముందు మనకు దేవుడు తెలియదా? బీజేపీ లేకున్నా దేవుడికి అయ్యే నష్టం లేదు.. బీజేపీ ఓడిపోయిన సరే దేవుడికి ఏమీ నష్టం ఉండదు.. శ్రీరాముడు కూడా రాజధర్మం పాటించాలని చెప్పాడు.. మరి బీజేపీ అది పాటిస్తుందా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో గాని అహ్మదాబాద్‌లో గాని వరదలు వస్తే ఒకే రకంగా స్పందించాలే కదా? శ్రీరాముడు మనిషిని మనిషిగా చూడమని చెప్పాడు.. మతం పేరిట రాజకీయాలు చేసే సన్నాసులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలె అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కేంద్రంలో ఉండే పెద్దల మెడలు వంచాలన్న.. రాష్ట్రానికి నిధులు రావాలన్న పద్మారావు గౌడ్ గారు గెలవాలె.. హైదరాబాద్‌లో ప్రజలు చాలా బాధపడుతున్నారు.. కరెంట్ కోతలు, నీటి కష్టాలు మొదలైనయ. ఆటో తమ్ముళ్లు, మహిళలు, రైతులు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అని తెలిపారు.

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకుంటున్న వాళ్లను నేను కోరేదొక్కటే.. మీరు 10-12 సీట్లు మాకు అప్పగించండి.. తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.. ఏడాది లోపలనే మీరు కోరుకున్నట్లుగా కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను నడిపిస్తారు అని అన్నారు.