mt_logo

బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఏం లేక చిత్ర పటాలు పంచుతున్నారు: దుబ్బాకలో హరీష్ రావు

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి మద్దతుగా, దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ బీడీ కట్టలు పట్టల మీద పుర్రె గుర్తు పెడితే, బీజేపీ బీడీ కట్టల మీద పన్ను వేశారు.. కేసీఆర్ మాత్రం బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చారు. 30 ఏళ్లు బీడీలు చేస్తేనే ఫించన్ ఇస్తామని నిబంధన పెట్టారు అని తెలిపారు.

దుబ్బాక స్కూల్‌లో కేసీఆర్ చదువుకున్నడు.. ఇక్కడి ప్రజల కష్టం తెల్సు. కాంగ్రెస్ వాళ్లు జూటా మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు. రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. కళ్యాణ లక్ష్మి లేదు.. 24 గంటల కరెంటు లేదు అని విమర్శించారు.

బీజేపీ అభ్యర్థి మళ్ళీ వస్తున్నాడు.. మరోసారి బుద్ధి చెప్పాలి. విద్యావంతుడు గెలవలా.. బ్లాక్‌మెయిలర్ గెలవాలా.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అడ్డిమార్ గుడ్డి దెబ్బ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. అంత అహంకారం ఎందుకు అని దుయ్యబట్టారు.

బీజేపీ అదాని, అంబానీలను పెంచి పోషించింది.. పేదలను మాత్రం మరిచిపోయింది. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఏం లేక చిత్ర పటాలు పంచుతున్నారు. దుబ్బాక గడ్డ మీద కారు జోరు కొనసాగాలి అని కోరారు.

రూ. 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపించాలని కోరుతున్నాను అని హరీష్ రావు పిలుపునిచ్చారు.