mt_logo

సాయన్న బిడ్డ నివేదితని ఎమ్మెల్యేగా, రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా గెలిపించాలి: కంటోన్మెంట్ రోడ్ షోలో కేటీఆర్

మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మా చెల్లెలు, కేసీఆర్ కూతురును అరెస్ట్ చేసి 50 రోజులైంది.. మేము మోడీకి భయపడేది లేదు. మోడీ కాదు ఆయన బాబుకు కూడా భయపడడం.. ఏం చేస్తారో చేసుకోండి.. మేము సెక్యులర్ పార్టీ.. భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటాం అని స్పష్టం చేశారు.

10-12 సీట్లు గెలిపిస్తే బీఆర్ఎస్ ఎవరితో కలుస్తదని చాలా మంది అడుగుతున్నరు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్ని పెద్ద పార్టీలు. అందులో బీఆర్ఎస్, బిజూ జనతాదళ్, వైఎస్సార్‌సీపీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనమందరం ఒక్కటి కావొచ్చు.. ఢిల్లీ వాడే దిగి వచ్చి కాళ్లు పట్టుకోవచ్చు.. ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో అని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కూడా బీజేపీ దుష్ట ప్రయత్నం చేస్తోంది. తెలంగాణకు గొంతు ఉండాలంటే పార్లమెంట్‌లో గులాబీ కండువా ఉండాలె. ఈ బీజేపీ, కాంగ్రెసోళ్లతో అయ్యేది లేదు పోయేది లేదు అని విమర్శించారు.

2014లో బడాభాయ్ మన ముందుకి వచ్చి.. చాలా హామీలు ఇచ్చిండు. రూ. 15 లక్షలు అన్నాడు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, బుల్లెట్ రైళ్లు, రైతుల ఆదాయం డబుల్, ఇళ్లు లేని వారికి ఇల్లు, ప్రతి ఇంటికి నల్లా అని చెప్పిండు.. ఏమైనా చేసిండా? అని అడిగారు.

పదేళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి ఏం పనిచేసిండో చెప్పాలె కదా? పదేళ్లలో రూపాయి పని కూడా మోడీ చేయలే.. బీజేపీ అభ్యర్థి వస్తే ఎందుకు ఓటు వేయాలో అడుగలే. స్కైవే కోసం కంటోన్మెంట్ భూములు ఇయ్యమంటే పదేళ్లు అడిగిన పట్టించుకోలేదు అని కేటీఆర్ దుయ్యబట్టారు

ఒక్క కాలేజ్, ఒక్క స్కూల్ కూడా ఇయ్యలే.. ఎందుకు ఓటు వేయాలంటే గుడి కట్టినం అంటున్నారు. గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదాద్రి.. దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా?కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టిండు.. రిజర్వాయర్లు, చెరువులను పూర్తి చేసిండు.. వాటికి కూడా దేవుళ్ల పేర్లు పెట్టిండు అని గుర్తు చేశారు.

బీజేపీ వాళ్లు ముస్లింలు మంచోళ్లు కాదన్నట్లు చిత్రీకరించి మత చిచ్చు పెట్టే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. అలాంటి పార్టీని దగ్గరకు రానియ్యకుండా జాగ్రత్త పడాలె. హైదరాబాద్‌లో మొత్తం సీట్లు మాకే ఇచ్చారు మీరు. బడా భాయ్ 2014 లో మోసం చేస్తే.. 2023లో ఛోటా భాయ్ బయలుదేరిండు.. అరచేతిలో వైకుంఠం చూపిండు.. కానీ మీరు ఆగం కాలే.. మీకు తెల్సు వాడు లంగా అని.. కానీ జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో హామీలు నమ్మి ఓట్లు వేసిన్రు అని అన్నారు.

అడ్డి మారి గుడ్డి దెబ్బలా ముఖ్యమంత్రి అయ్యిండు.. సిగ్గు లేకుండా ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసిన అని చెప్పుకుంటున్నాడు.. రూ. 2,500, రూ. 4 వేలు, బోనస్, తులం బంగారం, స్కూటీలు వచ్చినయా? ఒక్క ముఖ్యమంత్రి అయి ఉండి ఇంత లుచ్చా మాటలు చెప్పొచ్చా? అని అడిగారు.

నాకు ఓటు వేయకపోతే మెడల పేగులు వేసుకుంట అంటాడు.. ముఖ్యమంత్రి పేగులు మెడల వేసుకుంటాడా? రేవంత్ రెడ్డిని నేను దొంగ, లంగా అని మాత్రం అనలే.. మీరు అన్నరు నాకు తెల్వదు. కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని ముందే చెప్పినం.. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతదని అన్నాం.. కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్‌లో కరెంట్ పోతుందా? నీళ్ల బాధలు చాలైనయా? అని కేటీఆర్ అన్నారు.

ముఖ్యమంత్రి హౌలగాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటడు.. ఇటువంటి హౌలా గాడు మన సీఎం. బడా భాయ్ మోసం చూశినం.. ఛోటా భాయ్ మోసం చూసినం.. ఒక్కసారి ఆలోచించండి.. రాహుల్ బాబా చౌకిదార్ చోర్ అంటాడు.. రేవంత్ బాబా మాత్రం మోడీ బడే భాయ్ అంటాడు. రాహుల్ బాబా అదానీ ఫ్రాడ్ అంటాడు.. రేవంత్ బాబా అదానీ మేరా ఫ్రెండ్ అంటాడు.. రాహుల్ బాబా గుజరాత్ మోడల్ ఫేక్ అంటాడు.. రేవంత్ బాబా మాత్రం గుజరాత్ మోడల్ తెస్తా అంటాడు.. రాహుల్ బాబా లిక్కర్ స్కాం లేదు కేజ్రీవాల్ అరెస్ట్ తప్పు అంటాడు.. రేవంత్ బాబా మాత్రం కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అంటాడు.. ఆప్ కీ అదాలత్ ప్రొగ్రామ్‌కు పోయి మోడీకి ఓటు వేయమని అంటాడు.. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీలోకి పోతడది నాకు డౌట్ కొడుతోంది అని తెలిపారు.

కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అని ఎంతమంది అనుకుంటున్నారు ? అందరూ అనుకుంటున్నారా.. ఐతే మీరు మాకు 10-12 సీట్లు మాకు అప్పగించండి.. మళ్లీ కేసీఆర్ గారు రాజకీయాలను శాసిస్తారు.. ఆరు నెలల్లో ఈ లంగల, దొంగల రాజ్యం పోతది అని తెలిపారు.

సాయన్న గారి అమ్మాయి నివేదిత గారిని ఎమ్మెల్యేగా, రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుతున్నా.. ఒకటే కుటుంబంలో ఒకటే ఏడాదిలో సాయన్న, లాస్య నందిత చనిపోయారు.. కలలో కూడా ఊహించని విధంగా విధి వెంబడించింది.. లాస్య మరణం మాకు షాక్ ఇచ్చింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

అంత దుఖం ఉన్న సరే పార్టీ ఆదేశాల ప్రకారం మీకు సేవ చేయటానికి నివేదిత మీ ముందుకు వచ్చింది.. తండ్రి చనిపోయి, సోదరి చనిపోయిన సరే కంటోన్మెంటే నా కుటుంబం అని ఆమె మీ ముందుకు వచ్చింది.. మీ బిడ్డలాగ భావించి నివేదితను గెలిపించాలని కోరుతున్నా అని అన్నారు.