తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే.. కేసీఆర్‌ను గద్దెదించి తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న కాంగ్రెస్‌కు సొంతపార్టీ నాయకులనుంచే షాక్‌ల మీద షాక్ తగులుతున్నది. రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులనుంచి దరఖాస్తులు అహ్వానించగా, అదికాస్తా రచ్చరచ్చగా మారింది. ఒకస్థానానికి ఐదుగురు, ఆరుగురు దరఖాస్తు చేసుకొన్నారు. ఎవరికివారే తమదే టికెట్ అంటూ ఒకరిపై ఒకరు కుట్రలు చేస్తున్నారు. సీనియర్ నాయకులని చూడకుండా జూనియర్లు వారి ప్రతిష్ఠ దిగజారుస్తున్నారు. మాజీ ఎంపీ, సీనియర్‌నేత మధుయాష్కీగౌడ్‌కు వ్యతిరేకంగా సాక్షాత్తు గాంధీ భవన్‌లో వెలిసిన పోస్టర్లే ఇందుకు నిదర్శనం. తాజాగా, టీకాంగ్రెస్‌లో కమిటీల చిచ్చు మొదలైంది. సీనియర్ నాయకుల అలకలతో హస్తంలో లుకలుకలు మొదలయ్యాయి.
ఎంపీ కోమటిరెడ్డి అలక.. చిన్నబుచ్చుకున్న చిన్నారెడ్డి
ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీతోపాటు ఆర్భాటంగా కమిటీలను ప్రకటించింది. అధిష్ఠానం..రాష్ట్ర ఎన్నికల కమిటీలో పలువురు సీనియర్ నాయకులకు స్థానం కల్పించింది. కానీ, అతి కీలకం, ప్రాధాన్యత ఉన్న సీడబ్ల్యూసీ, స్క్రీనింగ్ కమిటీలో రాష్ట్రనేతలకు మొండిచెయ్యి చూపింది. ఒక్క ఉత్తమ్‌కుమార్‌రెడ్డికే దాదాపు అన్ని కీలక కమిటీలో స్థానం కల్పించిన అధిష్ఠానం.. సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, సీతక్క, జానారెడ్డి, చిన్నారెడ్డికి ఢోకా ఇచ్చింది. దీంతో వారంతా అలకపాన్పు ఎక్కారు. ఉత్తమ్‌కు కీలక కమిటీల్లో స్థానం దక్కి.. తమకు మొండిచెయ్యి ఎదురుకావడంపై గుర్రుగా ఉన్నారు. తీవ్ర అవమానంతో రగిలిపోతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే.. పార్టీ కార్యక్రమాలనే బహిష్కరించారు. కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. చిన్నారెడ్డికూడా చిన్నబుచ్చుకోవడంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి, బుజ్జగించారు. ఇప్పుడు కోమటిరెడ్డిని సముదాయించి, దారిలోకి తెచ్చుకొనేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, పార్టీలోని నాయకులకే న్యాయం చేయాలని కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే తమను ఎట్లా పాలిస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.