హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో మెషీన్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. క్యాటరాక్ట్ సర్జరీల నిర్వహణలో ఈ అత్యాధునిక యంత్రాలు ఎంతో సహాయం చేయనున్నాయి. అల్ట్రా సౌండ్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యంత్రాల ద్వారా సర్జరీలు సులభంగా, వేగంగా చేసేందుకు అవకాశం లభిస్తుంది. సర్జరీ తర్వాత రోగులు కూడా తొందరగా కోలుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 యంత్రాలను ఏర్పాటు చేశాం. వీటన్నింటినీ ఒకే సారి ఇప్పుడు ప్రారంభించుకున్నాం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం
సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో కూడా రెండు మెషిన్లు ఏర్పాటు చేశాం. మలక్ పేట ఏరియా ఆస్పత్రిలోను ఒక యంత్రం అందుబాటులోకి వచ్చింది. మిగతా 9 జిల్లాలు మహబూబ్ నగర్ , వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వికారాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఒక్కో యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఒక్కో యంత్రం ఖరీదు 28 లక్షల 85 వేల రూపాయలు. మొత్తంగా 12 యంత్రాలకు కలిపి ప్రభుత్వం 3 కోట్ల 46 లక్షలు ఖర్చు చేసింది. ప్రైవేటులో 30 నుండి 40 వేలు అయ్యే సర్జరీ పేదలకు ఉచితంగా అందనుంది. సర్జరీ నిర్వహించడానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి సమస్యలు గుర్తించిన వారికి ఈ పాకో మిషన్ల ద్వారా అవసరమైన చికిత్స అందనుంది. అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన కంటి వెలుగు.. రెండు దఫాల్లో విజయవంతంగా పూర్తి చేశాం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంతటి ముఖ్యమైన కళ్ళు సరిగ్గా కనిపించక పోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. స్కూల్ కు వెళ్లే విద్యార్థి నుంచి, పండు ముసలి వరకు కంటి సమస్యలతో బాధపడుతుంటారు.
100 పని దినాల్లో కోటి 62 లక్షల మందికి కంటి పరీక్షలు
చిన్న సమస్యే కదా అని వదిలేస్తూ, కాలం గడుపుతుంటారు. చివరకు అది పెద్ద సమస్యకు దారి తీస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎంకేసీఆర్ గారు కంటివెలుగు అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, విజయవంతంగా అమలు చేసారు. ఎవరూ అడగకముందే, ఇంటి పెద్దకొడుకుగా ఆలోచించిన కేసీఆర్‌గారు ప్రజల కంటిసమస్యలను దూరం చేసేందుకు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి, ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదు.100 పని దినాల్లో కోటి 62 లక్షల మందికి కంటి పరీక్షలు చేసారు. ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి అంటే 25.1 శాతం మందికి గ్లాసెస్ పంపిణీ చేయడం జరిగింది. ఇందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందించారు. 18.08 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
కంటి పరీక్షల్లో ఆల్ టైం రికార్డ్
ఇంత పెద్ద మొత్తంలో కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, మందులు పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ కు తప్ప ప్రపంచంలో మరే ప్రభుత్వానికి లేదు. కంటి పరీక్షల్లో మాది ఆల్ టైం రికార్డ్.. మీతో ఒక విషయం పంచుకోవాలి అనుకుంటున్నాను. ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి స్థాపకులు, ప్రపంచ ప్రఖ్యాత నేత్రవైద్యనిపుణులు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావుగారు మొదటివిడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాను. ఎన్నో సదస్సులు హాజరయ్యాను. కానీ, కంటి సమస్యలపై దృష్టిసారించి, ఇంత పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించడం ఎక్కడా చూడలేదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసి చూపించారు. నా హృదయం ఉప్పొంగి పోయింది’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు. అంతటి గొప్ప కార్యక్రమం కంటి వెలుగు.