mt_logo

దేశ భవిష్యత్తు కోసం మరో ఉద్యమం చేస్తాం : సీఎం కేసీఆర్

కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను దేశ భ‌విష్య‌త్తు కోసం ఆలోచిస్తున్నాని, ఉన్న వ‌న‌రులు, వ‌స‌తులు కూడా వాడుకోలేని ప‌రిస్థితి నుంచి ఈ దేశం బ‌య‌ట‌ప‌డాలని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే మ‌హారాష్ట్ర సీఎంతో మాట్లాడానని, రేపు ముంబై కూడా వెళ్లి కలుస్తానని అన్నారు. దేశం కోసం ఎక్క‌డికైనా వెళ్తానని, నేను ఈ దేశానికి సిఫాయినని, కుక్క‌ల‌కు భ‌య‌ప‌డే ప్రసక్తే లేదని, దేశం కోసం పోరాడుతనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దేశ భ‌విష్య‌త్తు కోసం ఉద్య‌మిస్తా :

దేశ భవిష్యత్తు కోసం మరో ఉద్యమాన్ని లేవదీస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ ప‌ద్ధ‌తిలో ముందుకు వెళ్లాలి అనేది మేథోమ‌థ‌నంలో తేలుతుందని, కొద్ది రోజుల్లో హైద‌రాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ అధికారుల స‌ద‌స్సును నిర్వ‌హించ‌బోతున్నామన్నారు. దేశానికి కొత్త ఎజెండా సెట్ కావాల్సి ఉందని, కొత్త పంథాతో యువ‌కులు పురోగ‌మించాలన్నారు. 75 ఏళ్ల త‌ర్వాత భార‌త‌దేశం ఆర్థిక ప‌రిస్థితి 40 లక్షల కోట్లు దాట‌లేదు అంటే సిగ్గుతో త‌ల‌దించుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం చెబుతున్న జీడీపీ లెక్క‌లు అన్నీ తప్పని, అన్నీ అబ‌ద్ధాలే చెబుతూ… దేశాన్ని గోల్ మాల్ చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ ఉద్య‌మాన్ని ప్రారంభించక ముందు కూడా ఇలాంటి ఆందోళనలే ఉన్నాయి. కానీ రెండేళ్లలోనే మార్పు కన్పించింది. వ‌ల‌స‌లు పోయిన తెలంగాణ‌ ప్రజలు తిరిగొచ్చిన మాట వాస్తవం కాదా ? విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్క‌డ వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తున్నారు. ఈరోజు ఉజ్వ‌ల‌మైన తెలంగాణ ఉంది. క‌రోనా వ‌చ్చి వ‌ల‌స కూలీలు భ‌య‌ప‌డుతుంటే వాళ్ల‌కు 500 రూపాయలు ఇచ్చి 172 రైళ్లు పెట్టి వాళ్ల రాష్ట్రాల‌కు పంపించామని సీఎం గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *