తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతున్నది. నోటికి ఏది వస్తే ఆ హామీ ఇస్తూ ఇక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నది. నెత్తి నాది కాదు.. కత్తి నాది కాదు.. అనే తరహాలో హామీల వర్షం గుప్పిస్తున్నది. ఆ హామీల అమలు సాధ్యమా? తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా? అనే ఆలోచన లేకుండా అలవికాని హామీలతో హస్తం పార్టీ హంబక్ డంబక్ చేసింది. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆరు హామీలతో కూడిన గ్యారంటీ కార్డును విడుదల చేశారు. ఈ ఆరు హామీలు చూసి తెలంగాణవాదులు అవాక్కయ్యారు. వీటికి వారంటీ లేదని, వాటి అమలు అసాధ్యమని తేల్చిచెప్తున్నారు. 50 ఏండ్లు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ఆ నాయకులు ఇప్పుడు కొత్తగా అసాధ్యమైన ఆరు హామీలు గుప్పిస్తే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ తీరును సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు ఎండగట్టారు. సుసంపన్నమైన కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్న హస్తం పార్టీ.. అక్కడ ఇవ్వని భారీ హామీలను కూడా తెలంగాణలో ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటిని నమ్మడానికి తామేమైనా అమాయకులమా? అని నిలదీశారు.
ఆ ఆరూ అసాధ్యమే!
1.ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ పథకాన్ని హస్తం పార్టీ కర్ణాటకలో అమలు చేయడంలో విఫలం కాగా.. అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఇది పనికిమాలిన హామీ అంటూ మేధావులు మండిపడుతున్నారు. ఇక మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామంటున్నారు. కర్ణాటకలోనే రూ.2వేలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం లేదు.. అలాంటప్పుడు ఇక్కడ ఎలా అమలు చేస్తారు?
- ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇంటి స్థలం లేనివారికి స్థలంతోపాటు రూ. 5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ గ్యారంటీ ఇచ్చింది. అయితే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు అంటే ఎలా ఉండేవో తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. పైరవీలు.. లంచాలు.. కాళ్లరిగేలా తిరిగినా.. అందులో కొంత కమిషన్ తీసుకోనిదే ఇల్లు మంజూరయ్యేది కాదు.. ఇప్పటికే తెలంగాణ సర్కారు దాదాపు ఇండ్లులేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇచ్చింది. తాజాగా గృహలక్ష్మి పథకం తీసుకొచ్చి ఇంటి జాగా ఉన్నవారికి రూ.3లక్షలు అకౌంట్‌లో జమ చేస్తున్నది. అలాంటప్పుడు కాంగ్రెస్ ఇచ్చే ఇంటి హామీని ఎలా నమ్ముతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
- చేయూత అనే పథకం కింద రూ. 4వేల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామని చెప్పడంపై ‘మాకు నమ్మకం లేదు’ అని ప్రజలు చెప్తున్నారు. అలాగే, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇవ్వకుండా ఇక్కడెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
- గృహజ్యోతి కింద ప్రతి ఇంటికీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జనం కరెంట్ కోతలతో అల్లాడుతుంటే పట్టించుకోని హస్తం పార్టీ ఇక్కడ కరెంట్ ఎలా ఉచితంగా ఇస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం అమలవుతున్నదని, ఈ పథకాన్ని కాంగ్రెస్ కాపీ కొట్టి మరో 100 యూనిట్లు పెంచి ‘గృహజ్యోతి’ అని గొప్పగా ప్రకటించుకొంటున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. - ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15వేల రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12వేలు, వరిపంటకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, ఇప్పటికే తెలంగాణ సర్కారు రైతు బంధు కింద ప్రతి ఏటా ఎకరానికి రూ. 10వేలు ఇస్తున్నది. ఇప్పటికే రూ.75 వేల కోట్లను రైతు ఖాతాల్లో జమ చేసింది. దీనినే కాంగ్రెస్ కాపీ కొట్టి రైతు భరోసాగా పేరు మార్చింది. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామని చెప్పడంపై వ్యవసాయ నిపుణులే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వారిని అసలు ఎలా గుర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతులు, కూలీలకు కలిపి కోటి మందికిపైగా రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని, అది ఎలా సాధ్యమని అడుగుతున్నారు.
- విద్యార్థులకు విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిది. అయితే, ఇప్పటికే తెలంగాణలో విద్యార్థులకు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఉచిత విద్య అందుతున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైద్యవిద్య కూడా తక్కువ ఖర్చులో పూర్తి చేసే అవకాశం దక్కింది. అయినా.. ప్రతి విద్యార్థికి రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు.. ఇంటర్నేషనల్ స్కూల్ అనేది అసాధ్యమని.. ఏదో ఓట్లకోసం కాంగ్రెస్ ఈ హామీ ఇచ్చినట్టు స్పష్టమవుతున్నదని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది? అసలు తెలంగాణ బడ్జెట్ ఎంత? అనే కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ గుడ్డిగా హామీలు గుప్పించిందని మండిపడుతున్నారు. ఇందుకోసం రెండు, మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరమని అంటున్నారు. కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్తున్నారు.