కాంగ్రెస్ మోడల్ అట్టర్ ఫ్లాప్ అంటూ తెలంగాణవాదులు మండిపడుతున్నారు. వారిది ఫేక్ మోడల్ అని ఎద్దేవా చేస్తున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశాల నేపథ్యంలో నగర వీధుల్లో కాంగ్రెస్ తీరును ఎండగడుతూ పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పోల్చుతూ చురకలంటిస్తున్నారు. కాంగ్రెస్ మాడల్ అట్టర్ ఫ్లాప్.. బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ సూపర్ హిట్ అంటూ ఫ్లెక్సీలపై సోదాహరణంగా వివరించారు. ఎన్నికల వేళ తెలంగాణలో అది చేస్తాం.. ఇది చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ.. 50 ఏండ్ల పాలనలో ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు. మోసకారి కాంగ్రెస్‌ను తాము నమ్మేది లేదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలాంటి పథకాలున్నాయా?
తెలంగాణకు వచ్చి నోటికి ఏది వస్తే ఆ హామీలు ఇస్తున్న కాంగ్రెస్.. ఆ పార్టీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలాంటి పథకాలు అమలు చేస్తున్నదా? అని వాల్‌పోస్టర్ల ద్వారా తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ రూ. 10 లక్షలు పూర్తి ఉచితంగా ఇస్తున్నారని, మరి కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో దళితులకు కాంగ్రెస్ రిక్తహస్తమే చూపిస్తున్నదని పేర్కొన్నారు. దివ్యాంగులకు తెలంగాణలో కేసీఆర్ సర్కారు రూ.4,016 పింఛన్ ఇస్తుండగా.. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో 1250, కర్ణాటక 1100, హిమాచల్‌ప్రదేశ్‌లో 1300, ఛత్తీస్‌గఢ్‌లో రూ 500 మాత్రమే ఇస్తున్నారని లెక్కలతో సహా ఎండగట్టారు. వృద్ధాప్య పింఛన్ తెలంగాణలో రూ. 2016 ఇస్తుండగా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.1200 దాటడం లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కేసీఆర్ సర్కారు రైతు బంధు కింద ఎకరానికి రూ.10వేలు, అన్నదాత ఎలా చనిపోయినా రైతు బీమా ద్వారా ఆ కుటుంబానికి రూ. 5లక్షలు ఇస్తున్నారని, ఇలాంటి పథకాలు కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో లేవని పోస్టర్లపై ముద్రించారు. అలాగే, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉండగా..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతలు..బిల్లుల మోతలు.. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లతో ప్రజలు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. అందుకే తమకు కాంగ్రెస్ ఫేక్ మోడల్ వద్దని, బీఆర్ఎస్ సూపర్ మోడల్ కావాలని తేల్చి చెప్పారు.