mt_logo

తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణ!

  • సాగులో తెలంగాణ స‌రికొత్త రికార్డు
  • 2.08 కోట్ల ఎకరాల్లో ప‌సిడి పంట‌లు
  • ఈ ఏడాది 1.21 కోట్ల ఎకరాల్లో నాట్లు
  • రైతు సంక్షేమ ప‌థ‌కాల‌తో  రికార్డుల మోత‌
  • ఫలించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషి

హైదరాబాద్‌: నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ‌.. అని అన్న దాశ‌ర‌థిగారి మాట‌ల‌ను నిజంచేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. తెలంగాణ స‌ర్కారు రైతు సంక్షేమ ప‌థ‌కాల‌కు తోడు కేసీఆర్ సంక‌ల్పంతో నేడు నా తెలంగాణ రెండు కోట్ల ఎక‌రాల మాగాణంగా మారిపోయింది. దాశ‌ర‌థిగారి క‌ల‌ను నిజంచేస్తూ ర‌త‌నాల‌లాంటి పంట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయింది. కోటి ఎకరాలు సాగు కల… రెట్టింపు స్థాయిలో సాకారమైంది. ఈ ఏడాది (2022-23) రెండు సీజన్లలో కలిపి రికార్డుస్థాయిలో 2.08 కోట్ల ఎకరాల్లో పంటల సాగు నమోదయింది. వానకాలంలో 1.36 కోట్ల ఎకరాల్లో సాగు కాగా, యాసంగిలో 72.59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఒక ఏడాదిలో ఈ స్థాయిలో పంటలు సాగు కావడం ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారికావ‌డం విశేషం. ఈ ఏడాది వరి సాగులోనూ సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. తొలిసారిగా 1.21 కోట్ల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. మొత్తం సాగులో వరి పంట అత్యధికంగా 60 శాతం వరకు ఉండటం గమనార్హం.  

నాడు బీడు భూములు.. నేడు రెండు కోట్ల ఎకరాల మాగాణం..

స‌మైక్య పాల‌కులు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సాగు నీళ్లు కరువు, కరెంట్‌ కటకట వెరసి భూములన్నీ బీడుబారాయి. దీంతో రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. యాసంగిలో పంట గురించి ఆలోచించే పరిస్థితే ఉండేది కాదు. ఇక వానకాలంలో వానదేవుడు కరుణిస్తే అంతో ఇంతో సాగయ్యేది. కానీ వ్యవసాయరంగంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు సాగు గతినే మార్చేశాయి. బీడు భూముల తెలంగాణ.. రెండు కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసే అత్యున్నతస్థాయికి చేరింది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు మాత్రమే. ఇది 2017 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక 2019 నుంచి ఆకాశమే హద్దుగా సాగు పెరుగుదల నమోదవుతున్నది. తొలిసారిగా 2020-21లో రెండు కోట్ల ఎకరాల సాగువిస్తీర్ణం నమోదైంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఆ రికార్డును బద్దలుకొట్టి 2.08 కోట్ల ఎకరాలకు పెరిగింది. అయితే 2020-21లో కురిసిన అధిక వర్షాలు సాగుకు తోడయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం సాధారణ వర్షాపాతం ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరంప్రాజెక్టు పుణ్యమా అని రికార్డుస్థాయి సాగు నమోదయింది.

దేశానికి బువ్వ‌గిన్నెగా తెలంగాణ‌

ఒకప్పుడు తెలంగాణలో తిండిగింజలు పండితే చాలకునే పరిస్థితులుండేవి. అలాంటి తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నంపెట్టే బువ్వ‌గిన్నెగా ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. కేవలం వరిసాగే కోటి ఎకరాలు దాటటం గమనార్హం. 2014తో పోల్చితే ప్రస్తుతం వరిసాగు భారీగా పెరిగింది. 2014-15లో కేవలం 35 లక్షల ఎకరాల్లో ఉన్న వరిసాగు ఇప్పుడు 1.21 కోట్ల ఎకరాలకు విస్తరించింది. 2020-21లో తొలిసారిగా కోటి ఎకరాలు దాటిన వరిసాగు తాజాగా మరోసారి కోటి ఎకరాల మార్కును దాటి ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది.

సీఎం కేసీఆర్ కృషితో ప‌సిడిపంట‌ల‌ తెలంగాణ‌

సీఎం కేసీఆర్ సంకల్పం, పట్టుదలే వ్యవసాయరంగం దశ, దిశను మార్చేసింది. తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు ముందే రైతుల గోస తీర్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్న కేసీఆర్‌, స్వరాష్ట్రం సిద్ధించగానే వాటిని ఆచరణలో పెట్టారు. ఇందులో భాగంగానే 24 గంటల ఉచిత విద్యుత్తుతో కరెంట్‌ గోస తీర్చారు. మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్ధరించారు. ఇక సాగునీటి గోస తీర్చేందుకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరానికి శ్రీకారం చుట్టారు. అతి తక్కువ కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ బీడుభూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేశారు. ఇక రైతుబంధు పథకంతో రైతుల పెట్టుబడి గోస తీర్చారు. సకాలంలో ఎరువులు, విత్తనాలను అందించారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ చర్యలతో ఇప్పుడు తెలంగాణ రైతులు సగర్వంగా బతుకగలుగుతున్నారు. తెలంగాణ వ్యవసాయరంగం దేశంలో మేటిగా నిలిచింది. బీడుభూముల తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణంగా మారింది.

మొత్తం పంట‌ల సాగు విస్తీర్ణం

2014-15       1.31కోట్ల ఎక‌రాలు

2022-23       2.08 కోట్ల ఎక‌రాలు

వ‌రిసాగు విస్తీర్ణం

2014-15       34.97 ల‌క్ష‌ల‌ ఎక‌రాలు

2022-23      121 ల‌క్ష‌ల ఎక‌రాలు