mt_logo

తెలంగాణ కన్నీటి “బిందు”వు

By: నూర శ్రీనివాస్

మీరు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? ప్రత్యేక రాష్ట్ర సాధనకన్నా మీకేమీ ముఖ్యంకాదా? ఆ క్రమంలో కుటుంబాన్ని కూడా త్యాగం చేయాలనుకుంటున్నారా? తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆగండి! మరణానంతరం మీ కుటుంబ జీవితాన్ని ఎలాగూ చూడలేరు! కానీ.. ముందూ వెనుకా చూడకుండా ఉద్యమం కోసం ప్రాణాలు వదిలేసిన అనేకానేక మంది అమరుల కుటుంబాల్లో మచ్చుకు ఒక కుటుంబం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను గమనించండి! కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న ఓ జీవితం ఆనవాళ్లను చూడండి! చావు ఒక కుటుంబంలో ఎంతటి పెను ఉత్పాతాలను రేపుతుందో పరిశీలించండి! జీవిత విధ్వంసాన్ని బేరీజువేయండి! ఉద్యమం కోసం తండ్రి చనిపోగా.. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే వైధవ్యం తన జీవితంపై రాసిన కర్కశగీతను చెరిపేసుకుని తల్లి తన జీవితం తాను చూసుకోగా.. తాతయ్య, నానమ్మల వద్ద పెరుగుతున్న చిన్నారిని ఆత్మీయంగా చేతుల్లోకి తీసుకోండి! ముద్దులొలికే మాటలతో.. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలియకపోయినా.. తండ్రి ఫొటోకు మొక్కుతున్న దృశ్యాన్ని గమనించండి! ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న ఆ చిన్నారి.. రేప్పొద్దున మా నాన్నేడి? అమ్మేది? అని ప్రశ్నిస్తే ఇవ్వాల్సిన జవాబులను సిద్ధం చేయండి! అనాథయిన తమ కొడుకు బిడ్డకు అన్నీ తామై పెంచుతున్న ముసలి దంపతుల కన్నీటిధారలు దోసిలిపట్టండి! తమ తదనంతరం ఆ బిడ్డ గతేంటని ఆ ఇద్దరు పడుతున్న మనోవేదనకు ఒక పరిష్కారం చూపండి!

పక్కనే ఉన్న ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు బిందు! ఈ బిడ్డకు తండ్రి, తల్లి లేరు. ఇప్పుడా చిన్నారికి నాయినమ్మ, తాతయ్యలే సర్వస్వం! మూడేళ్లుగా ఆ ఇద్దరు ముసలోళ్లకూ అంతే! ఒక చావు ఈ ఇంట్లో అంతులేని విషాదాన్ని నింపింది! తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక యువకుడు చేసిన బలిదానం.. ఇప్పుడా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఏ తల్లిదంవూడులకూ ఎదురుకాకూడని పరిస్థితిని మిగిల్చింది! ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత దాని ఫలాలను అనుభవించాల్సిన యువతే సమిధలుగా మారుతున్న తెలంగాణ పల్లెల్లో జీవన విధ్వంసంలో ఇదో కోణం. ఆత్మహత్యలు చేసుకున్నవారి తల్లిదంవూడులు ఎలా ఉన్నారు? బలిదానం ఇచ్చినవారి బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలం రేగడి తండా పరిధిలోని శంకర్ తండాకు చెందిన తెలంగాణ అమరవీరుడు లకావత్ సురేశ్ మరణానంతర జీవన దృశ్యాన్ని నమస్తే తెలంగాణ పరిశీలించినప్పుడు అంతులేని విషాదం కనిపించింది. పుట్టుకతోనే కన్నీళ్లను వెంటతెచ్చుకున్న కన్నీటి ‘బిందు’వు పరిస్థితి చూస్తే మనసు కకావికలమైంది! అందుకే అదే విజ్ఞప్తి మళ్లీ మళ్లీ. ఆత్మహత్యలొద్దు.. బతికి సాధిద్దాం!

లకావత్ సురేశ్‌ది సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబం. సురేశ్ తండ్రి రెడ్యా, తల్లి శాంత. ఆయనకు ఒక తమ్ముడు (దేవేందర్), ఒక అక్క (స్వరూప ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం), చెల్లెలు సరిత తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఇంటికి పెద్ద కొడుకని కష్టనష్టాలకు ఓర్చి ఏడో తరగతి వరకు హన్మకొండలో ఇంగ్లిష్ మీడియంలో చదివించారు. కుటుంబ పరిస్థితులు బాగాలేక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే చూడలేక సురేశ్ చదువు మానేసి జఫర్‌గడ్‌లో, స్టేషన్‌ఘన్‌పూర్‌లో హోటల్‌లో పనిచేస్తూ ఆర్థికంగా ఆసరాగా నిలిచాడు. అక్కడే ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. తెలంగాణ వస్తేనే యువతకు భవిష్యత్ ఉంటుందని బలంగా నమ్మాడు. శ్రీకృష్ణ కమిటీతో అన్యాయం జరిగిందని భావించి మనస్తాపంతో పురుగుల మందుతాగి 15-02-2010న ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేనాటికి భార్య రష్మీ (21)(పేరు మార్చాం) ఆరు నెలల గర్భవతి. సురేశ్ మృతిచెందిన మూడు నెలలకు (1-05-2010) బిందు పుట్టింది. మూడు నెలల తరువాత రష్మీ తల్లిదంవూడులు, బంధువులు, ‘ఆమె ఇప్పటి నుంచి ఎంతకాలం ఉంటది. అందరి కండ్లు ఒక్కతీరుగనే ఉంటయా. ఆ పిల్లను వాళ్లకు (సురేశ్ కుటుంబసభ్యులకు) అప్పగించి తెగతెంపులు చేసుకోవాల్సిందే’ అని పట్టుబట్టారు. విడాకులు తీసుకున్నారు. రష్మీ రెండో పెళ్లి చేసుకొని బిందును వాళ్ల నానమ్మకు అప్పగించి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ ముసలి తల్లిదంవూడులు కొడుకు బిడ్డను సాదుతున్నారు.

కేసీఆర్ మీద కేసు పెట్టమన్నరు

‘నా కొడుకు సచ్చిపోయి పుట్టెడు దుఃఖంల మేముంటే తెలుగుదేశపోల్లు గా రెండు మూడు నెలల కింద కారేసుకొని ముగ్గురు వచ్చిండ్లు. హైదరాబాద్‌లకు రాండ్లి మీకు పైసలిత్తమన్నరు. వాళ్ల పార్టీ ఆఫీసులకు తీస్కపోయిండ్లు. 700 మంది తెలంగాణ కోసం సచ్చిపోయినోళ్లు కుటుంబాల నుంచి ఒక్కొక్కరు వచ్చిండ్లు. అక్కడికి పోయేదాకా మంచిగనే మాట్లాడిండ్లు ఆయింత ఆడికిపోంగనే ‘ఇగో కేసీఆర్ చేయబట్టే మీ పిల్లలు సచ్చిపోయిండ్లని పోలీస్‌స్టేషన్ల కేసులు పెట్టండ్లీ. అట్లయితే మీకు ఇంటికి యాభైవేలు ఇత్తం’ అని చెప్పిండ్లు. పొరగాండ్లు పోయి మా ఏడుపు మేం ఏడుస్తాంటే. వాళ్ల ఏడుపు వాళ్లది. అప్పుడు అందరం ఒక్కసారే లేచి ఇరుగమరుగ తిట్టినం. ఎగబడ్డం. ఇద్దరు ముగ్గురైతే కోపం వచ్చి కొంతమందిని కొట్టిండ్లు. మీరేమన్నా ఆదుకునేదుంటే ఆదుకోండ్లి. లేదంటే లేదని చెప్పినం’ అని శాంత కన్నీటి పర్యంతం అవుతూ తన బిడ్డ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే తెలంగాణ పేరుతో నాటకాలాడేవాళ్ల దుర్నీతిని ఎండగట్టింది.

చావొద్దు బిడ్డా!.

‘మూడేండ్ల నుంచి నర్కం అయితాంది. తెలంగాణ కోసం పాణాలు తీస్కొని మీరు పోతాండ్లు. మిమ్మల్నే నమ్ముకొని బతుకుతాం అనుకున్నవాళ్ల బతుకులను చీకటి చేయొద్దు. కుటుంబాలను, అవ్వయ్యలను రోడ్డుపాలు చేయొద్దు’ అని తెలంగాణ సమాజానికి రెడ్యా, శాంత కండ్లలో కన్నీళ్లు నింపుకుంటూ విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణ తెత్తమన్నోళ్లు తేకుంటనే పోతాండ్లు. ఇత్తమన్నోళ్లు ఇయ్యకుంటనే పోతాండ్లు. మా ఉసురు తాకిపోతరు’ అని శాపనార్థాలు పెట్టారు. ‘మేం ఒక్కటే అడుగుతానం. మా కొడుకులను మాకు ఇయ్యండి. లేదంటే తెలంగాణ తేండి’ అంటూ కోరతన్నారు. తెలంగాణలో ఆత్మహత్యల పంటలకు వస్తోన్న ఫలితాలివ్వి. ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాల్లో వస్తోన్న మార్పులివి. చిన్నాభిన్నమవుతున్న కుటుంబాల దీనస్థితి ఈ ప్రాంత రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయా? నేతలూ మనసు పెట్టి ఆలోచించండి! యువకుల్లారా, విద్యార్థుల్లారా.. మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కన్నీటి బిందువులు రాల్చకండి. ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షించే మీరు మనసుకు బాధైతే ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించండి. ఆత్మహత్య చేసుకునే ధైర్యమే ఉంటే, ప్రపంచంలో దేన్నైనా సాధించగలం. ఇది నిజం.

మా నాన్నేడంటే ఏమని చెప్పాలె


‘‘అయ్యా నా కొడుక్కు అవ్వయ్యంటే పాణం. ఎక్కడికిపోయినా ఇంటికి వచ్చేది. గంట లేటయితే కడుపు తరుక్కుపోయేది. అసొంటిది నా బిడ్డ మమ్ములను వదిలి ఎళ్లిపోయిండు. అమ్మా..! నేను తక్కువనే చదువుకున్న. ఎంత కష్టమన్నచేసి తమ్ముణ్ని మంచిగ చదివియ్యాలని అనెటోడు. వాళ్ల నాయినన్న కురుసగ ఉండెటోడు. ఆయన చెప్పులు సురేశ్‌కు సరిపోయేవి కాదు. అయ్యే ఏసుకుని తెలంగాణ, తెలంగాణ అనేటోడు. ఎక్కడ మీటింగున్నా పోయేటోడు. గింత పనిచేస్తడని అనుకోలేదు. నా కొడుకు సచ్చిపోయినంక మా కోడలు తల్లిగారోళ్లు ఇళ్లంత ఆగమాగం చేసిండ్లు. పెండ్లప్పుడు పెట్టిన సామాను, బట్టలు తీస్కపోయిండ్లు. నా కొడుకు సచ్చిపోయినంక మూడునెలలకు ఈమె (బిందును చూపిస్తూ) పుట్టింది. ఈ పిల్ల మూడునెలలు కాంగనే కోడలు తల్లిగారోళ్లు ఇంటిమీద పడ్డరు. పోలీస్ కేసు పెట్టిండ్లు. విడుపుగాయితం ఇచ్చినం. నాలుగైదూళ్ల పెద్దమనుషులు, తిరుగుడు, పంచాదులు ఉత్తగనే అయితదా సారూ. అప్పుల పాలయినం. ఆగమయినం. మా ఖర్మ గిట్లనే ఉంటదని అనుకున్నం. ఇడుపుగాయితం అయినంక పిల్లను పట్టుకొని ఇంటికాన్నే ఉండుడు. మూడేండ్ల పొద్దు కూలీలేదు నాలిలేదు. పిల్లను పట్టుకొని ఉండుడే. ఏం జెయ్యాలే మా రాత గిట్లయింది. నాకింకో బిడ్డ ఉంటే సాదుకోకపోదునా. ఏం చేత్తం? కన్నకడుపు ఊకుంటదా? ఈ పిల్లల నా కొడుకును సూసుకుంట (కంటి ధార పారుతూనే ఉంది). ఇప్పుడిప్పుడే మాటలత్తానయి. రేపు పెరుగుతాంటే అందరు పిల్లలపూక్క ‘మా అమ్మేది.. అంటే ఏం చెప్పాల్నో? నాన్నా అని అడుగుతే ఏం చెప్పాల్నో. గింతంత లేదు పిల్ల గిప్పుడే మేం నా కొడుకు ఫోట్వ కాడికి పోయి మొక్కుతాంటే, అది రెండు చేతులు పట్టుకొని మొక్కుతాంటే పాణాలు అవిసిపోతయి. [నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *