mt_logo

దేశంలో అత్యధిక శాతం వ్యవసాయానికి కరెంటు వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణ: మంత్రి సింగిరెడ్డి

వానాకాలం పంటల సాగుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా తెలంగాణ రైతాంగానికి అంతరాయం లేకుండా కరెంటు అందజేస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నాం అని మంత్రి తెలిపారు. సాగునీటి రాకతో రాష్ట్రంలో వరిసాగు పెద్ద ఎత్తున పెరిగింది, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నా వానాకాలంలో ఇప్పటి వరకు 57.51 లక్షల ఎకరాల్లో వరి, 44.73 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని అన్నారు. వరితో పాటు ఇప్పటి వరకు 5.28 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.61 లక్షల ఎకరాలలో కందులు సాగు చేశారు. మొత్తం రాష్ట్రంలో 1.18 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల వ్యవసాయ  పంటలు సాగు చేస్తున్నారు. 

భూగర్భ జలవనరులు పెరగడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు మూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద భరోసాతో రైతులు పంటలు సాగు చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 1న 14,747 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదయింది.. గత ఏడాది ఇదే రోజు 11,198 మెగావాట్ల విద్యుత్ నమోదవడం గమనార్హం.. అయినా రైతాంగానికి కరెంటు విషయంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చూస్తున్నదని గుర్తు చేసారు. 

వరుణుడు కరుణించడంతో శనివారం రాష్ట్రంలో 8891 మెగావాట్ల విద్యుత్ డిమాండ్, ఆదివారం రోజు 7414 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయిందని తెలిపారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్ లో వర్షాలు లేకున్నా డిమాండ్ కు సరిపడా కరెంటు సరఫరా చేశారు. రాష్ట్రంలో మొత్తం కరెంట్ వినియోగంలో వ్యవసాయ రంగం 35 నుంచి 40 శాతం వాటా నమోదవుతున్నది. దేశంలో అత్యధిక శాతం వ్యవసాయ రంగానికి కరెంటు వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు.