తెలంగాణ రాష్ట్రానికి మితిమీరిన అప్పులున్నాయని విషప్రచారం చేస్తున్న విపక్షాలకు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో, తెలంగాణ అప్పులు చేయడంలో 27వ స్థానంలో నిలిచినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. తద్వారా అతితక్కువ అప్పులున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్టు లెక్కలతో సహా తేల్చిచెప్పింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక (బీజేపీ)తోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చేసిన అప్పులు చాలా తక్కువని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. లోక్‌సభలో సోమవారం ఎంపీ సునీల్‌కుమార్ సోని అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ.. గత నాలుగేండ్లలో (2018-19 నుంచి 2021-22 వరకు) వివిధ రాష్ట్రాలు చేసిన అప్పుల వివరాలను లెక్కలతో సహా వెల్లడించారు.