mt_logo

భారత ప్రజల అనుకూల ఫ్రంట్ మాది : సీఎం కేసీఆర్

దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొన్నదని, ఆ శూన్యతను పూరించేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తనవంతుగా దేశ రాజకీయాలను సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 నుంచి దేశ రాజకీయాలు కొత్త క్రాంతి బాటలో పయనిస్తాయని, కేసీఆర్‌ చెప్తే అది జరిగి తీరుతుందని అన్నారు. కలిసొచ్చే నేతలతో చర్చలు జరుపుతామని, ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉన్నదని, అందులో ఉత్తమమైనదాన్ని ఎంచుకొంటామని వెల్లడించారు. కదిలించాల్సింది నలుగురు నాయకులనో, ముగ్గురు సీఎంలతో కాదని, కదిలించాల్సింది భారత ప్రజానీకాన్ని అని స్పష్టంచేశారు. తమది బీజేపీకో, కాంగ్రెస్‌కో వ్యతిరేక ఫ్రంట్‌ కాదని, భారత ప్రజల అనుకూల ఫ్రంట్‌ అని, ప్రజల మేలు కోరే రాజకీయ ఫ్రంట్‌ అని చెప్పారు. తన 50 ఏండ్ల రాజకీయ అనుభవంతో చెప్తున్నానని, జాతీయ రాజకీయాల్లో కచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీ వస్తుందన్నారు. ఇప్పు డే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. ఈ క్రమంలో తాను వంద శాతం కీలక భూమిక పోషిస్తానని చెప్పారు. దేశంలో చాలా లోతైన సమస్యలు ఉన్నాయని, 75 ఏండ్లలో దేశాన్ని ఎంత గోల్‌మాల్‌ తిప్పారన్న అధ్యయనాలు ఉన్నాయని తెలిపారు. దేశంలో అడ్వకేట్ల సంఖ్య 20 లక్షలు ఉన్నదని, 1,018 యూనివర్సిటీలు, 45 వేల నుంచి 65 వేల వరకు డిగ్రీ కాలేజీలున్నాయని.. వీరందర్నీ కదిలిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆ పని ప్రారంభమైందన్నారు. దేశ రాజకీయాలను క్వాలిటేటివ్‌, క్వాంటిటేటివ్‌గా తీర్చిదిద్దేలా తమ ప్రయత్నం ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *