
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనం
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం, సంస్థ ప్రయోజనాలు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే బడ్జెట్‌లో అందిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగా ఆర్టీసీ సంస్థ గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతోంది. కానీ, నష్టాలు మాత్రం తప్పడం లేదు. అయినా ఆర్టీసీ సంస్థను కాపాడాలి, అందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం చూడాలనే లక్ష్యంతో 43 వేల 373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయి. కానీ, వారి ప్రయత్నాలను వమ్ము చేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండింది.
వైద్యారోగ్య రంగంలో అద్భుత ప్రగతి
రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడే వైద్య కళాశాలలు ఉండేవి. వీటిలో ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉన్నవే. ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆదిలాబాద్, నిజమాబాద్‌లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకొక వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే విధాన నిర్ణయం తీసుకొని స్వల్పకాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించి చరిత్ర సృష్టించింది. మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఇటీవలనే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇవి కూడా త్వరలోనే ప్రారంభించి, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని ప్రభుత్వం పరిపూర్తి చేయబోతున్నది. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న పథకాలు అద్భుతమైన ఫలితాలు అందించాయి. వైద్య ఆరోగ్యరంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాయి.
కోట్లాది మంది దృష్టి లోపాలను సరిదిద్దిన కంటి వెలుగు కార్యక్రమం, ఉచిత డయాలసిస్ సేవా కేంద్రాల ఏర్పాటు, ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ల పంపిణీ, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలు అద్భుత ఫలితాలను సాధిస్తూ యావద్దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.
పెరిగిన అవసరాలకు తగినట్లుగా హైదరాబాద్ నగరం నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. వరంగల్ నగరంలో 1100 కోట్లతో రెండు వేలకు పైగా పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. మరో 2 వేల పడకల ఏర్పాటుతో ‘‘నిమ్స్’’ను విస్తరించు కుంటున్నాం. ఇందు కోసమై నిర్మించే నూతన భవనానికి ఈ మధ్యే నేను శంకుస్థాపన చేశాను. 108, 104 సేవలను పెంచాలనే ఉద్దేశంతో ఇటీవలనే కొత్తగా 466 వాహన సేవలను ప్రారంభించుకున్నాం. ఫోన్ చేసిన 15 నిమిషాల లోపు ఈ వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి సేవలందిస్తున్నాయి.