mt_logo

దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత మందుల కిట్లు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఔషధాల కిట్లను అందిస్తున్నది. హైపర్‌టెన్షన్‌, డయాబెటీస్‌, క్యాన్సర్‌ రోగులకు నెలనెలా మందులు ఇస్తున్నది. నాన్‌ కమ్యూనికెబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) కింద మందులను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 22 జిల్లాలో ఈ కిట్ల పంపిణీని వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. 30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి హైపర్‌టెన్షన్‌, షుగర్‌, క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఎన్‌సీడీ కింద రాష్ట్రవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించాయి. ఇందులో అత్యధికంగా హైపర్‌ టెన్షన్‌ బాధితులు ఉన్నట్టు తెలిపారు.

క్యాన్సర్‌ రోగుల్లో ప్రధానంగా ఓరల్‌, బ్రెస్ట్‌, సర్వైకల్‌ క్యాన్సర్స్‌పై దృష్టి సారించారు. ఈ మూడు రకాల క్యాన్సర్లపై ఎంఎన్‌జే దవాఖాన ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో స్కీనింగ్‌ సెంటర్ల ద్వారా ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ఎన్‌సీడీలో భాగంగా మందుల కిట్‌ అందజేస్తున్నారు.

ఎన్‌సీడీ మొదటి దశలో భాగంగా 22 జిల్లాల్లో డ్రగ్‌ కిట్స్‌ పంపిణీ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 2.3 లక్షల మందికి కిట్స్‌ పంపిణీ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ జిల్లాల్లో 6.20 లక్షల మంది రోగులు రిజస్టర్‌ చేసుకొన్నారు. మిగిలిన 11 జిల్లాల్లో 8.80 లక్షల మంది రోగులు ఉన్నట్టు అంచనా. త్వరలోనే ఆ జిల్లాల్లో కూడా డ్రగ్‌ కిట్స్‌ పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో హైపర్‌టెన్షన్‌, షుగర్‌, క్యాన్సర్‌కు సంబంధించి సుమారు లక్షన్నర మంది రోగులు ఉన్నట్టు పాత రికార్డుల ద్వారా తెలుస్తున్నది. త్వరలోనే గ్రేటర్‌ పరిధిలో ఈ వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్‌ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్‌సీడీ 3వ దశలో గ్రేటర్‌ పరిధిలోని రోగులకు మందుల కిట్స్‌ను పంపిణీ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *