-61 ఏండ్లు దాటిన 3,797మంది వారసులకూ
ఉద్యోగాలిచ్చేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం
ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా కొనసాగిన వీఆర్‌ఏ వ్యవస్థకు సీఎం కేసీఆర్ చెల్లుచీటీ పాడారు. మస్కూరు, సుంకరులుగా దీనస్థితిలో జీవితం వెళ్లదీసిన గ్రామ రెవెన్యూ సహాయకుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. 16,758 మంది వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్ధికరిస్తూ తెలంగాణ సర్కారు జీవో నంబర్ 81ను జారీచేసింది. ఈ ఉత్తర్వులను వీఆర్ఏ జేఏసీ నాయకులకు స్వయంగా సీఎం కేసీఆరే అందజేసి, అసలు సిసలు పాలకుడు అంటే ఎలా ఉంటారో కళ్లకుగట్టారు. అలాగే, 61 ఏండ్లు దాటిన, విధినిర్వహణలో మరణించిన, అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం చేయలేనివారి పిల్లలకూ కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసు చాటుకొన్నారు. సాక్షాత్తూ సీఎం కేసీఆరే తమ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు తీసుకొచ్చి, అందజేయడంతో వీఆర్ఏ జేఏసీ నాయకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సమైక్య పాలనలో తమకు గౌరవ వేతనం ఇవ్వాలని ఎంత ప్రాధేయపడ్డా కనీసం కనికరం చూపలేదని, కానీ తెలంగాణ రాగానే సీఎం కేసీఆర్ తమకు గౌరవ వేతనం ఇచ్చారని.. ఇప్పుడు ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తమ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని జేఏసీ నాయకులు మురిసిపోయారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొంటామని చెప్పారు.
వీఆర్ఏ రెగ్యులరైజేషన్ పూర్తి వివరాలు ఇవే..
-వీఆర్ఏల క్రమబద్ధీకరణ వల్ల 20,555 మందికి లబ్ధి చేకూరనున్నది.
-ప్రస్తుతం పనిచేస్తున్న 16,758 మందిక వీఆర్ఏలకు విద్యార్హతల ఆధారంగా పేస్కేల్ వర్తింపజేస్తున్నారు.
-విద్యార్హతల ఆధారంగా వారిని మూడు క్యాటగిరీల్లో సర్దుబాటు చేస్తున్నారు.
-10వ తరగతి చదివితే ఆఫీస్ సబార్డినేట్, ఇంటర్మీడియట్ చదివినవారికి రికార్డ్ అసిస్టెంట్ లేదా తత్సమాన, డిగ్రీ ఆపై చదివినవారికి జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన స్కేల్ వర్తింజేస్తారు.
-10వ తరగతి అర్హత కలిగిన 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాలో, డిగ్రీ, ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించనున్నారు.
-మరో 3,797 మంది వీఆర్‌ఏల పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తారు. వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్‌తోనే వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు ఇందుకు సంబంధించిన వివరాలు అందజేయాలని జేఏసీ నాయకులను కోరారు.