mt_logo

జలాశయాలలో సోలార్ కేంద్రాలు వద్దు.. తెలంగాణ ఫిషరీస్ సొసైటీ అభ్యంతరం

రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను బేషరతుగా విరమించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనల వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం నాడు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్ కో) కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడాన్ని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. గతంలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించిందని అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే సామాజిక మరియు పర్యావరణ సంబంధమైన సమస్యలపై తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను మన్నించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను పక్కకు పెట్టిందని పిట్టల రవీందర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రకృతిలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను మానవ సంక్షేమానికి వినియోగించుకునే విషయంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ రిజర్వాయర్లలో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకాలు తలెత్తే ప్రమాదాన్ని నిలువరించడం కోసం మాత్రమే తాము ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు పిట్టల రవీందర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని సుమారు 130 రిజర్వాయర్లలో సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని ఈ రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల చేపల వేటకు తీవ్రమైన ఆటంకాలు తలెత్తుతాయని, రిజర్వాయర్లలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే సోలార్ ప్లేట్లు జలాశయంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలలో ఆవరించి ఉండటం వల్ల ఆయా ప్రదేశాలలో చేపల వేటను నిషేధిస్తారని, ఈ పరిణామాలు మత్స్యకారుల జీవన స్థితిగతుల పైన ఆదాయ వనరుల పైన సామాజిక భద్రత పైన ప్రతికూల ప్రభావాలను తీవ్రస్థాయిలో చూపిస్తాయని ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన మరియు ప్రజా పాలనను అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించే ఇట్లాంటి ఆలోచనలు ముందుకు తీసుకు రావడం తీవ్ర అభ్యంతరకరమని పిట్టల రవీందర్ ఆక్షేపించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో చేపల పెంపకం మీద ఆధారపడిన లక్షలాదిమంది మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన ఈ ప్రకటనలో డిమాండ్ చేశారు.