mt_logo

మ‌న చెరువు నిండుగా.. సంబురంగా ప‌దేండ్ల పండుగ‌

  • మిషన్‌కాకతీయతో చెరువులకు పూర్వవైభవం 
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పండగ

గొలుసుక‌ట్టు చెరువుల‌కు తెలంగాణ కేరాఫ్ అడ్ర‌స్‌. కాక‌తీయుల కాలంలో అద్భుత‌మైన త‌టాకాలు రూపుదిద్దుకొన్నాయి. కానీ, 60 ఏండ్ల స‌మైక్య‌పాల‌న‌లో మ‌న ఊర చెరువులు పూడిక‌ల‌తో ఆకారాన్ని కోల్పోయాయి. గొల‌సుక‌ట్టు తెగిపోయి నిర్జీవంగా మారిపోయాయి. వలసపాలకుల కుట్రపూరిత చర్యలతో మ‌న చెరువు నిర్లక్ష్యానికి గురైంది. జల దోపిడికి బలిపశువుగా మారింది. పూడిక చేరిపోయాయి.  కట్టలు కరిగిపోయాయి. వ‌ర్షంనీరు నిల్వ‌కుండా వ‌ట్టిపోయాయి. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ మొద‌ట చెరువుల‌పైనే దృష్టిపెట్టారు. మిష‌న్ కాక‌తీయ‌తో వాటికి పున‌రుజ్జీవం పోసేందుకు సంక‌ల్పించారు. 

మొత్తంగా 46,531 చెరువుల‌ను గుర్తించారు. పునరుద్ధరణకు నడుం బిగించారు. 2015 మార్చి 12న నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్‌ పాత చెరువు వద్ద సీఎం కేసీఆర్‌ స్వయంగా ‘మిషన్‌ కాకతీయ’కు శ్రీకారం చుట్టి నవ తెలంగాణకు పునాది వేశారు. ఆయ‌నే స్వయంగా చెరువుల్లో పూడిక‌తీసి, మ‌ట్టిని ఎత్తి ట్రాక్ట‌ర్‌లో పోశారు. అలా మొద‌లైన మిష‌న్ కాక‌తీయ అప్ర‌తిహ‌తంగా కొన‌సాగి చెరువుల‌కు పూర్వ‌వైభవం తెచ్చింది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,527 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు పైగా పెరిగింది.

ప్రాజెక్టుల అనుసంధానం.. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం

తెలంగాణ స‌ర్కారు కేవ‌లం మిష‌న్ కాక‌తీయ‌తో ఆగిపోకుండా  చెరువుల‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా ప్రణాళికలను రూపొందించి, అమలు చేస్తున్నది. కాకతీయులు చూపిన బాటలో సీఎం కేసీఆర్‌ చేసిన బృహత్తర ఆలోచన చేశారు. ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానించారు.  ఇప్పటివరకు దాదాపు 15 వేల చెరువులకుపైగా ప్రాజెక్టులతో ముడిపెట్టారు. ఆయా పంటకాలువలకు ఎక్కడికక్కడ ఓటీలను ఏర్పాటు చేసి చెరువులను క్రమం తప్పకుండా ప్రాజెక్టు నీటితో నింపుతున్నారు. ఫలితంగానే నేడు మండుటెండ‌ల్లోనూ పూర్తిస్థాయి నీటి నిల్వతో చెరువులు నిండుకుండ‌ల్లా మారాయి. మరోవైపు వాగుల పునరుజ్జీవ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికే 650 నిర్మాణాలు ప్రారంభించి 400 మేరకు పూర్తి చేసింది.

ప‌ల్లెల‌కు జ‌ల‌సిరి

ఊర‌చెరువులు నిండుగా మారడంతో  తెలంగాణ పల్లె పూర్వవైభవాన్ని సంతరించుకొన్నది. స‌మైక్య పాల‌న‌లో చిధ్రమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రాణం పోసుకున్నది. రాష్ట్ర ప్రగతి రథానికి ప్రధాన ఇరుసుగా మారింది. పంటల సాగువిస్తీర్ణం పెరగడ‌మేకాదు.. అనుబంధరంగాల విస్తరణ శరవేగంగా దూసుకుపోతున్నది. చెరువులు నిండుకుండ‌లా మార‌డంతో మ‌త్స్య ప‌రిశ్ర‌మ గ‌ణ‌నీయ వృద్ధిని సాధించింది. జీవాలు, పాడి పశువులకు నీటి కొరత లేకుండా పోయింది. పాడి అభివృద్ధికి కూడా ఇప్పుడు తెలంగాణ చిరునామాగా నిలుస్తున్నది. ఎవుసం, పాడి పెరగడంతోపాటు ఇతర వృత్తికులాలకు కూడా నేడు నూతన జవసత్వాలు వచ్చి చేరాయి.

నేడు రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పండుగ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగను ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువుల పండుగను నిర్వహించనున్నారు. చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజల నిర్వహణతో పాటు, బోనాలు, బతుకమ్మలు, ప్రగతి నివేదిక ప్రదర్శన చేపట్టేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం మిషన్‌కాకతీయ డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులతోపాటు, మిషన్‌ కాకతీయ దాతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించటం విశేషం.