mt_logo

ధ‌ర‌ణి తీసేస్తే ద‌ళారీ రాజ్య‌మే.. డిజిటల్‌ రికార్డులతోనే భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త‌ ప‌రిష్కారం

తాము అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో విసిరేస్తామ‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. బీజేపీ నాయ‌కులు కూడా ఈ పోర్ట‌ల్‌పై విషం క‌క్కారు. మ‌రి ధ‌ర‌ణితో లాభాలున్నాయా? న‌ష్టాలున్నాయా? ధ‌ర‌ణికంటే పాత రాత ప‌హాణీలే మేలా?  భూరికార్డుల డిజిట‌లీక‌ర‌ణ‌తో లాభాలు లేవా? అనే ప్ర‌శ్న‌ల‌ను పాత్రికేయ లోకం సంధించిన‌ప్పుడు మేధావులంతా ధ‌ర‌ణికే సై అంటున్నారు. ధ‌ర‌ణి లేకుంటే మ‌ళ్లీ పాత ద‌ళారి ద‌రిద్ర‌మే రాజ్య‌మేలుతుంద‌ని అంటున్నారు. ధ‌ర‌ణిని పూర్తిగా ర‌ద్దు చేస్తామ‌న‌డం నాయ‌కులు మూర్ఖ‌త్వం, తెలివిలేనిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు. ధ‌ర‌ణితో లాభాలు? ధ‌ర‌ణి లేకుంటే క‌లిగే న‌ష్టాలు..? ధ‌ర‌ణి ప్రాధాన్య‌త‌.. భూ రికార్డుల స‌వ‌ర‌ణ‌పై  భూచట్టాల నిపుణుడు, లీఫ్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ సునీల్‌కుమార్ వెలిబుచ్చిన‌ అభిప్రాయం ఆయ‌న మాట‌ల్లోనే..

భూ రికార్డుల డిజిట‌లైజేష‌న్‌తో అవినీతికి చెక్‌

భూ రికార్డుల డిజిట‌లైజేష‌న్‌తో అవినీతి క‌చ్చితంగా త‌గ్గ‌తుంది.  భూ రికార్డులు కంప్యూటర్‌లో/ఆన్‌లైన్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం 30 ఏండ్లుగా ప్రయత్నిస్తున్నది. రికార్డుల కంప్యూటరీకరణ జరిగితేనే అవినీతి తగ్గుతుందని, యజమానికి తెలియకుండా రికార్డులను మార్చే (ట్యాంపరింగ్‌) అవకాశం ఉండదని కేంద్రం చెప్తున్నది. ఏ మార్పు జరిగినా కంప్యూటర్‌ ఆధారంగానే జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 1980వ దశకంలో దేశవ్యాప్తంగా ఆరేడు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టగా, అందులో రంగారెడ్డి జిల్లా కూడా ఒకటి. ప్రారంభంలో ఈ పథకాన్ని ‘కంప్యూటరైజేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌- స్ట్రెంథెనింగ్‌ ఆఫ్‌ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్‌’ (సీఎల్‌ఆర్‌ అండ్‌ ఎస్‌ఆర్‌ఏ) అని పిలిచారు. దీన్ని 2004లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ‘నేషనల్‌ లాండ్‌ రికార్డ్స్‌ మాడ్రనైజేషన్‌ ప్రోగ్రాం’ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) అని మార్చగా.. అది ఆ తర్వాత ‘డిజిటల్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడ్రనైజేషన్‌ ప్రోగ్రాం’ (డీఎల్‌ఆర్‌ఎంపీ)గా స్థిరపడింది. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక పేరుతో కంప్యూటర్‌ రికార్డు ఉన్నది. ధరణిని రద్దు చేస్తామని ప్రకటిస్తున్నవారు కంప్యూటర్‌ రికార్డును రద్దు చేస్తామంటున్నారా? లేదా పేరును రద్దు చేస్తామంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

ధరణితో వేగంగా భూ హ‌క్కుల బ‌దిలీ

మహారాష్ట్రలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం కొనుగోలు, గిఫ్ట్‌, ఫౌతి ఇలా ఏ మార్గంలో అయినా భూమి హక్కులు ఒక వ్యక్తి నుంచి మరొకరికి సంక్రమించిన తర్వాత.. వారి పేరు మీదికి రికార్డుల్లో మారేందుకు సగటున 56 వారాలు పట్టింది. అంటే ఏడాదికి పైగానే. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, విభజన తర్వాత ప్రారంభంలో అయినా తెలంగాణలో కూడా కొన్ని నెలల సమయం పట్టేది. ఏండ్లకేండ్లు ఎదురుచూసినవారు కూడా ఉన్నారు. ఈ కాలాన్ని ధరణి కుదించింది. కాబట్టి.. ధరణిని రద్దు చేయడం గురించి కాకుండా లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నదో లేదో బేరీజు వేసుకోవాలి.

ధరణితో ప్రయోజనాలు

-రికార్డు అంతా ఒక్కచోటికి చేరి, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌, తాసిల్దార్‌ ఆఫీసులో, దేవాదాయ శాఖ, వక్ఫ్‌బోర్డు వద్ద, గ్రామపంచాయతీల్లో.. ఇలా రకరకాల రికార్డులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఒక్కచోటికి చేరాయి.

-ఇష్టమొచ్చినట్టు మార్పులు చేసే మ్యాన్యువల్‌ పద్ధతికి చరమగీతం పాడింది. ఏ మార్పులు జరగాలన్నా కంప్యూటర్‌ ద్వారానే జరుగుతున్నాయి. భూ యజమానికి కచ్చితంగా సమాచారం వెళ్తున్నది.

-రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకేసారి అరగంటలోపు జరిగిపోతున్నాయి. అందుకే దేశమంతా ఇప్పుడు ధరణిని ప్రశంసిస్తున్నది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇదొక అతిపెద్ద సానుకూల అంశం. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేదు. ఇది మన ఘనతగా చెప్పొచ్చు. అంతేకాదు.. ఆన్‌లైన్‌ రికార్డులను దాదాపు వంద శాతం చేసిన రాష్ట్రం తెలంగాణ. దేశంలో అతితక్కువ రాష్ర్టాలే ఈ మైలురాయి సాధించాయి. ఢిల్లీకి చెందిన ఒక సంస్థ భూముల ఆన్‌లైన్‌ రికార్డుల మీద ఏటా ఒక నివేదిక ఇస్తుంది. గతఏడాది నివేదికలో తెలంగాణ టాప్‌-5లో ఉన్నది.

-ఎవరు పడితే వారు ఉత్తర్వులు జారీ చేసి రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశం లేకుండా చేశారు. 

న‌ష్టానికి ప్ర‌భుత్వ‌మే జిమ్మేదారి

రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ ద్వారా టైటిల్‌ గ్యారంటీవైపు అడుగులు పడ్డాయి. టైటిల్‌ గ్యారంటీకి అత్యంత సులభమైన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్‌. గతంలో ఓ సభలో మాట్లాడుతూ ‘ఒక్కసారి రికార్డుల్లోకి ఎక్కినంక మీ భూ హక్కులకు ప్రభుత్వం జిమ్మేదారిగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే జరిమానా కడుతుంది’ అని చెప్పారు. జిమ్మేదారిగా ఉండటమే టైటిల్‌ గ్యారంటీ.. జరిమానా కట్టడం టైటిల్‌ ఇన్సూరెన్స్‌. 

భూ రికార్డులపై మొద‌ట మాట్లాడింది పీవీ 

పీవీ నర్సింహారావు ప్రధానిగా 1991లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీద చేసిన ప్రసంగంలో భూ రికార్డుల గురించి స్పష్టంగా చెప్పారు. ‘భూమి చుట్టూ అనేక వివాదాలు జరుగుతూ, అనేక పరిణామాలకు దారి తీస్తున్నాయి. వీటికి మూలం రికార్డులు సక్రమంగా లేకపోవడమే. గ్రామాల్లో భూరికార్డులను సక్రమంగా నిర్వహించి, ప్రజలు తమ హక్కుల గురించి తెలుసుకొనే అవకాశం కల్పిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.’ అని పేర్కొన్నారు. 1992లో ఎర్రకోట మీద మాట్లాడుతూ.. ‘గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల అనవసర గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి రికార్డుల నిర్వహణ మెరుగుపడాల్సిందే’ అని స్పష్టం చేశారు.

భూ రికార్డుల స‌వ‌ర‌ణ నిరంత‌ర ప్ర‌క్రియ‌

కర్ణాటకలో 20 ఏండ్ల కిందట భూ రికార్డుల డిజిటలీకరణ ప్రారంభమైంది. దీనిని దేశంలోనే అతిపెద్ద ల్యాండ్‌ రికార్డ్స్‌ కంప్యూటరైజేషన్‌ ప్రక్రియగా చెప్తారు. ఇప్పటికీ అక్కడ ఆన్‌లైన్‌ రికార్డుల్లో తప్పులు ఉన్నాయి. ఇంకా సరిచేస్తున్నారు. కాబట్టి భూ రికార్డులు 100 శాతం దోష రహితంగా ఉండవు . క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఎదురైన అనుభవాలకు అనుగుణంగా వాటిని సరిచేసుకుంటూ వెళ్లాల్సిందే. అది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ.