mt_logo

తెలంగాణ ఆరోగ్య మహిళ క్లినిక్స్‌కు విశేష స్పందన

-20 మంగళవారాల్లో 1,85,492 లక్షల మందికి స్క్రీనింగ్

  • మహిళల ప్రత్యేక క్లినిక్స్ ‘ఆరోగ్య మహిళ’కు విశేష స్పందన
  • ప్రాథమిక దశలోనే వ్యాధుల గుర్తింపు
  • సత్వర వైద్యంతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ
  • సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు పిలుపు

మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రారంభించిన “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గుర్తించి, అవసరమైన వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. గడిచిన 20 మంగళవారాల్లో మొత్తం 1,85,492 మంది మహిళలు స్క్రీనింగ్ పూర్తి చేసుకొని సమగ్ర ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేయడం జరిగింది. వారానికి సగటు ఓపీ 65 నమోదు కాగా, క్లినిక్స్ కు వచ్చిన 25 శాతం మంది మహిళలకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతున్నది. 

ఈ ఏడాది మార్చి 8, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలుత 24 జిల్లాల్లో 100 ఆరోగ్య మహిళ క్లినిక్స్ ప్రారంభించగా, జూన్ 14 నుంచి మిగతా 9 జిల్లాల్లోని 172 కేంద్రాల్లో ప్రారంభమైంది. మొత్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 272 ఆరోగ్య మహిళ క్లినిక్స్ సేవలందిస్తున్నాయి. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ క్లినిక్స్ లో పూర్తిగా మహిళా వైద్యులు, మహిళా సిబ్బంది ఉండి సేవలు అందిస్తారు. 8 రకాల వైద్య పరీక్షలను అందించడం జరుగుతున్నది. వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడం, వైద్యం అందించడంతో పాటు, ఉన్నత స్థాయి వైద్యం అవసరం ఉన్న వారిని, సమీపంలోని రిఫెరల్ సెంటర్ అయిన పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం సేవలు అందేలా చూస్తున్నారు. మమ్మోగ్రాం, అల్ట్రాసౌండ్, కొలనోస్కోపీ, క్రియోథెరపీ, పాప్ స్మియర్, బయాప్సీ వంటి పరీక్షలు అవసరమైన వారికి చేస్తున్నారు. 

ఆరోగ్య మహిళల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు..

1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు

2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్.. 

3, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.

4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.

5, మెనోపాజ్ దశ కు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.

6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.

7, సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. 

8, బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపై అవగాహన కలిగిస్తారు. 

క్యాన్సర్ స్క్రీనింగ్ ..

ఓరల్ క్యాన్సర్ విషయంలో 142868 మందిని పరీక్షించగా, 859 మందికి సస్పెక్ట్ చేయడం జరిగింది. పరీక్షల అనంతరం 5గురికి (0.6శాతం) నిర్ధారణ చేయడం జరిగింది.  బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో 141226 మందిని పరీక్షించగా 1313 మందిలో లక్షణాలు గుర్తించడం జరిగింది. రోగ నిర్ధారణ పరీక్షలు చేయగా 26 మందికి అంటే 2 శాతం మందికి ఉన్నట్లు వెల్లడైంది. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో 33579 మందిని పరీక్షించగా 1340 మందిలో లక్షణాలు గుర్తించడం జరిగింది. పరీక్షల అనంతరం 26 మందికి అంటే 1.9శాతం మందికి పాజిటివ్ రావడం జరిగింది.  కాన్సర్ పాజిటివ్ నిర్ధారణ అయిన మహిళలకు అత్యున్నత వైద్యం అందించేందుకు ఎం ఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరిగింది.

మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం – హరీశ్ రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి

మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళ క్లినిక్స్ ప్రారంభించింది.  ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక సమస్య బారిన పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేక కొందరు, వ్యాధి లక్షణాల పై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక మరికొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు అలాంటి వారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు పొందుతున్నారు. మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. మహిళలందరూ ఆరోగ్య మహిళ క్లినిక్స్ సద్వినియోగం చేసుకోవాలి.